రోమా 1:21-32
రోమా 1:21-32 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు దేవుణ్ణి ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి. వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు. వారు నిత్యుడైన దేవుని మహిమను క్షయమైన మనుష్యుల, పక్షుల, జంతువుల, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారు చేసిన విగ్రహాలకు ఆపాదించారు. కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు వదిలేసారు. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు, అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్. అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించాడు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకొన్నారు. అలాగే పురుషులు కూడా స్త్రీతో ఉండాల్సిన సహజ సంబంధాన్ని వదిలేసి, కామాగ్నితో రగిలిపోతూ పురుషులతో పురుషులు సంబంధాలు పెట్టుకున్నారు. పురుషులు పురుషులతో కలిసి అవమానకరమైన పనులు చేసి, తమ తప్పులకు తగిన శిక్షను పొందారు. అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగివుండడం విలువైనదిగా భావించలేదు, కనుక వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. వారు ప్రతి విధమైన దుర్మార్గంతో, చెడుతనంతో, దురాశలతో, దుర్నీతితో నిండివున్నారు. వారు అసూయ కలిగినవారిగా హత్యలు చేసేవారిగా, కొట్లాటలను మోసాన్ని ఓర్వలేనితనాన్ని కలిగివున్నారు. వారు వదరుబోతులు, అపనిందలు వేస్తారు, దేవుణ్ణి ద్వేషించేవారు, గర్విష్ఠులు, దురహంకారులు, బడాయిమాటలు పలికేవారు; వారు చెడు చేయడానికి మార్గాలను కనిపెడతారు; వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులు; వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.
రోమా 1:21-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు. ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు. ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు. వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు. వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.
రోమా 1:21-32 పవిత్ర బైబిల్ (TERV)
ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అంధకారమైపోయాయి. వాళ్ళు తాము తెలివిగలవాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు. ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు. అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చుకోవటానికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకొన్నారు. దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్! పురుషులు కూడా ఈ విధంగా చెయ్యటం వల్ల, దేవుడు వాళ్ళను సిగ్గుమాలిన తమ కోరికలకు వదిలివేసాడు. వాళ్ళ స్త్రీలు కూడా సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. అదే విధంగా, పురుషులు కూడా స్త్రీలతో సహజ సంపర్కాలు వదిలివేసి పురుషులతో సంపర్కం పొందాలనే కోరికలతో చెలరేగి పోయారు. పురుషులు పురుషులతో అసహజమైన సహవాసాలు చేసి తమ అసహజతకు తగిన శిక్షను స్వయంగా అనుభవిస్తున్నారు. పైగా వాళ్ళు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని లెక్కచెయ్యలేదు. కనుక దేవుడు వాళ్ళను వాళ్ళ నీచ బుద్ధికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు చెయ్యరాని పనులు చేసారు. అన్యాయం, దుష్టత్వం, దురాశ, దుర్నీతి, ద్వేషం, హత్య, పోరాటం, మోసం, అసూయ అనే గుణాలు వాళ్ళలో సంపూర్ణంగా నిండిపోయాయి. వాళ్ళు వృథాగా మాట్లాడుతూ, ఇతర్లను నిందిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతర్లపై దౌర్జన్యం చూపుతూ, గర్విస్తూ, బడాయిలు చెప్పుకొంటూ జీవిస్తూ ఉంటారు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి రకరకలా మార్గాలు కనిపెడ్తూ ఉంటారు. అంతేకాక తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళలో తెలివిలేదు. విశ్వాసము లేదు, హృదయము లేదు, కనికరం లేదు. దేవుని నీతి నియమములకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసేవాళ్ళకు మరణ శిక్ష తప్పదని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండటమే కాకుండా ఆ పనులు చేసేవాళ్ళను మెచ్చుకొంటూ ఉంటారు.
రోమా 1:21-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశ లను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్య సించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
రోమా 1:21-32 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వారు దేవున్ని ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి. వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు. వారు నిత్యుడైన దేవుని మహిమను నాశనమయ్యే మనుష్యులు, పక్షులు, జంతువులు, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారుచేసిన విగ్రహాలకు ఆపాదించారు. కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించారు. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు. అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్. అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించారు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. అలాగే పురుషులు కూడా స్త్రీతో ఉండాల్సిన సహజ సంబంధాన్ని వదిలేసి, కామాగ్నితో రగిలిపోతూ పురుషులతో పురుషులు సంబంధాలు పెట్టుకున్నారు. పురుషులు పురుషులతో కలిసి అవమానకరమైన పనులు చేసే తమ తప్పులకు తగిన శిక్షను పొందారు. అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం విలువైనదిగా భావించలేదు, కాబట్టి వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. వారు ప్రతి విధమైన దుర్మార్గంతో, చెడుతనంతో, దురాశలతో, దుర్నీతితో నిండి ఉన్నారు. వారు అసూయ కలిగినవారిగా హత్యలు చేసేవారిగా, కొట్లాటలను మోసాన్ని ఓర్వలేనితనాన్ని కలిగి ఉన్నారు. వారు వదరుబోతులు, నిందలు వేసేవారు, దైవ ద్వేషులు, గర్విష్ఠులు, దురహంకారులు, గొప్పలు చెప్పుకునేవారు; వారు చెడు చేయడానికి మార్గాలను కనిపెడతారు; వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులు; వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.