రోమా పత్రిక 1:21-32

రోమా పత్రిక 1:21-32 IRVTEL

వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు. ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు. ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు. వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు. వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

రోమా పత్రిక 1:21-32 కోసం వీడియో