రోమా పత్రిక 1:21-32

రోమా పత్రిక 1:21-32 OTSA

వారు దేవున్ని ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి. వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు. వారు నిత్యుడైన దేవుని మహిమను నాశనమయ్యే మనుష్యులు, పక్షులు, జంతువులు, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారుచేసిన విగ్రహాలకు ఆపాదించారు. కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించారు. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు. అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్. అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించారు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. అలాగే పురుషులు కూడా స్త్రీతో ఉండాల్సిన సహజ సంబంధాన్ని వదిలేసి, కామాగ్నితో రగిలిపోతూ పురుషులతో పురుషులు సంబంధాలు పెట్టుకున్నారు. పురుషులు పురుషులతో కలిసి అవమానకరమైన పనులు చేసే తమ తప్పులకు తగిన శిక్షను పొందారు. అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం విలువైనదిగా భావించలేదు, కాబట్టి వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. వారు ప్రతి విధమైన దుర్మార్గంతో, చెడుతనంతో, దురాశలతో, దుర్నీతితో నిండి ఉన్నారు. వారు అసూయ కలిగినవారిగా హత్యలు చేసేవారిగా, కొట్లాటలను మోసాన్ని ఓర్వలేనితనాన్ని కలిగి ఉన్నారు. వారు వదరుబోతులు, నిందలు వేసేవారు, దైవ ద్వేషులు, గర్విష్ఠులు, దురహంకారులు, గొప్పలు చెప్పుకునేవారు; వారు చెడు చేయడానికి మార్గాలను కనిపెడతారు; వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులు; వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.

Read రోమా పత్రిక 1

రోమా పత్రిక 1:21-32 కోసం వీడియో