సామెతలు 26:1-16
సామెతలు 26:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో, అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు. ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో, కారణం లేని శాపం కూడా నిలువదు. గుర్రానికి కొరడా, గాడిదకు కళ్లెం, బుద్ధిహీనుని వీపుకు బెత్తం! వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు, ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు. వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు. బుద్ధిహీనునిచేత వార్తను పంపేవాడు, కాళ్లు తెగగొట్టుకొని విషం త్రాగిన వానితో సమానుడు. కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు, అలాగే బుద్ధిహీనుని నోట సామెత ఉన్నా ఉపయోగం ఉండదు. బుద్ధిహీనుని గౌరవించువాడు, వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు. బుద్ధిహీనుని నోట సామెత, మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును. యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె బుద్ధిహీనుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు. తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ. సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు. సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు.
సామెతలు 26:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు. రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతున్న పిచ్చుక, రివ్వున ఎగిరిపోయే వానకోయిల ఎలా నేలకు దిగవో అలానే శాపానికి అర్హుడు కాని వాడికి శాపం తగలదు. గుర్రానికి చెర్నాకోల. గాడిదకు కళ్ళెం. మూర్ఖుల వీపుకు బెత్తం. మూర్ఖుడి మూఢత చొప్పున వాడికి జవాబు ఇవ్వద్దు. అలా ఇస్తే నువ్వు కూడా వాడి లాగానే ఉంటావు. వాడి మూర్ఖత్వం చొప్పున మూర్ఖుడికి జవాబివ్వు. అలా చేయకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకుంటాడు. మూర్ఖుడితో కబురు పంపేవాడు కాళ్లు తెగగొట్టుకుని విషం తాగిన వాడితో సమానం. అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే. బుద్ధిలేని వాణ్ణి గొప్ప చేసే వాడు వడిసెలలో రాయి కదలకుండా కట్టేసే వాడితో సమానం. మూర్ఖుల నోట సామెత మత్తులో ఉన్న వాడి చేతిలో ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది. బుద్ధిలేని వాణ్ణి, లేదా అటుగా వెళ్తూ ఉండే ఎవరో ఒకరిని కూలికి పెట్టుకునే వాడు అందరినీ గాయపరచే విలుకాడితో సమానం. తన మూర్ఖత్వాన్ని పదేపదే బయట పెట్టుకునే వాడు కక్కిన దాన్ని తినడానికి తిరిగే కుక్కతో సమానం. తానే జ్ఞాని అనుకునే వాణ్ణి చూసావా? వాణ్ణి సరి చేయడం కంటే మూర్ఖుణ్ణి సరి చేయడం తేలిక. సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు. బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు. కంచంలో సోమరి తన చెయ్యి ముంచుతాడు. దాన్ని తిరిగి నోటికి ఎత్తుకోవడం అతనికి బద్ధకం. సహేతుకమైన కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తానే జ్ఞానిననుకుంటాడు.
సామెతలు 26:1-16 పవిత్ర బైబిల్ (TERV)
తెలివి తక్కువ వానిని గౌరవించటం వ్యర్థం. అది వేసవిలో మంచులా, కోతకాలంలో వర్షంలా ఉంటుంది. నీకు చెడు సంగతులు సంభవించాలని ఒక మనిషి కోరుకొంటే చింతపడవద్దు. నీవు తప్పు ఏమీ చేయక పోతే నీకేమీ చెడు సంభవించదు. ఆ మనిషి మాటలు నీ పక్కగా ఎగురుతూ, ఎన్నడూ ఆగని పక్షుల్లా ఉంటాయి. గుర్రాన్ని చబుకుతో కొట్టాలి. గాడిదకు కళ్లెం పెట్టాలి. బుద్ధిహీనుణ్ణి బెత్తంతో కొట్టాలి. ఇక్కడ ఒక కష్టతరమైన పరిస్థితి ఉంది. ఒక బుద్ధి హీనుడు ఒక మూర్ఖ ప్రశ్న నిన్ను అడిగితే, నీవు మూర్ఖ జవాబు ఇవ్వవద్దు, అలా ఇస్తే నీవుకూడ బుద్ధిహీనునిలా కనబడతావు. కాని ఒక బుద్ధిహీనుడు ఒక మూర్ఖ ప్రశ్న అడిగితే, అప్పుడు నీవు తగిన మూర్ఖపు జవాబు ఇవ్వాలి, లేకపోతే అతడు తాను చాలా తేలివిగలవాడిని అనుకొంటాడు. తెలివి తక్కువ వాణ్ణి ఎన్నడూ నీ సందేశం తీసికొని వెళ్లనివ్వకు. నీవు అలా చేస్తే, నీ స్వంత కాళ్లు కోసి కొన్నట్టు ఉంటుంది. నీవు కష్టం అడిగి తెచ్చుకొంటావు. బుద్ధిహీనుడు జ్ఞానముగలది చెప్పటానికి ప్రయత్నించినప్పుడు, అది ఒక కుంటివాడు నడవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. బుద్ధిహీనునికి గౌరవం చూపించటం వడిసెలలో బండను కట్టడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. ఒక బుద్ధిహీనుడు జ్ఞానముగల మాట చెప్పటానికి ప్రయత్నిస్తే, అది ఒక తాగుబోతువాడు తన చేతిలోని ముల్లు తీసికోవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. ఒక బుద్ధిహీనుణ్ణి లేక దారిన పోయే వాళ్లను ఎవరినంటే వారిని కూలికి పెట్టుకోవటం ప్రమాదకరం. ఎవరికి హాని జరుగుతుందో నీకు తెలియదు. ఒక కుక్క ఆహారం తింటుంది. తరువాత దానికి జబ్బుచేసి, వాంతి చేసికొంటుంది. తర్వాత ఆ కుక్క ఆ ఆహారాన్ని మళ్లీ తింటుంది. ఒక బుద్ధిహీనుని విషయం కూడ అలానే ఉంటుంది. అతడు బుద్ధిహీనమైన అదే పనిని మరల మరల చేస్తాడు. ఒక మనిషి జ్ఞానము లేకుండానే జ్ఞానిని అని తలిస్తే అతడు బుద్ధిహీనునికంటె దౌర్భాగ్యుడు. “నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి. ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు. ఒక సోమరి మనిషి తన పళ్లెంలో నుండి తన భోజనాన్ని తన నోటి వరకు గూడ ఎత్తని మరీ బద్ధకస్తుడు. ఒక సోమరి మనిషి తాను చాలా జ్ఞానము గలవాడను అనుకుంటాడు. వారి తలంపులకు మంచి కారణాలు ఇవ్వగలిగిన ఏడుగురు మనుష్యులకంటే తాను చాలా ఎక్కువ తెలివిగల వాడనని అతడు తలస్తాడు.
సామెతలు 26:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును. గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు. వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును. మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు. కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు. –మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలోముల్లు గుచ్చుకొన్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును. తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు. సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును. ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును
సామెతలు 26:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)