సామెతలు 26:1-16

సామెతలు 26:1-16 OTSA

వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో, అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు. ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో, కారణం లేని శాపం కూడా నిలువదు. గుర్రానికి కొరడా, గాడిదకు కళ్లెం, బుద్ధిహీనుని వీపుకు బెత్తం! వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు, ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు. వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు. బుద్ధిహీనునిచేత వార్తను పంపేవాడు, కాళ్లు తెగగొట్టుకొని విషం త్రాగిన వానితో సమానుడు. కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు, అలాగే బుద్ధిహీనుని నోట సామెత ఉన్నా ఉపయోగం ఉండదు. బుద్ధిహీనుని గౌరవించువాడు, వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు. బుద్ధిహీనుని నోట సామెత, మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును. యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె బుద్ధిహీనుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు. తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ. సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు. సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు.

Read సామెతలు 26