సామెతలు 17:1-28

సామెతలు 17:1-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

తగాదాలతో కూడిన విందు కలిగి ఉన్న ఇంటి కంటే, సమాధానం నిశ్శబ్దంతో ఎండిన రొట్టె ముక్క తినుట మేలు. వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు. వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు. చెడు నడవడి కలవాడు మోసపు మాటలు వినును, అబద్ధికుడు నాశనకరమైన నాలుక మాటలు వింటాడు. పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు, ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు. పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము. అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు, అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం! లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది, ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు. ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు, జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు. బుద్ధిహీనునికి పడే వంద దెబ్బల కంటే, వివేకంగల వానికి ఒక గద్దింపు ప్రభావం చూపుతుంది. ఎదిరించువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట దయలేని దూత పంపబడును. మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు. మేలుకు బదులుగా కీడు చేయువాని ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు. గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది; కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి. దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం, రెండు యెహోవాకు అసహ్యమే. బుద్ధిహీనులు జ్ఞానాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు, వారి విద్యాభ్యాసానికి డబ్బు చెల్లించడం దేనికి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు. బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు. తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు. అసూయగలవాడు మేలుపొందడు తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును. మూర్ఖుని కనిన వానికి విచారం కలుగుతుంది, బుద్ధిహీనుని కనిన తండ్రికి సంతోషం ఉండదు. సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం, నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది. న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు. వివేకం ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు, కాని మూర్ఖుడి కళ్లు భూమి చివర వరకు తిరుగుతాయి. బుద్ధిలేని పిల్లలు తమ తండ్రికి దుఃఖం తెస్తారు, తమను కనిన తల్లికి అట్టివారు శోకం కలిగిస్తారు. అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే, నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు. తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంత గుణముగలవాడు మంచిచెడులు ఎరిగినవాడు. ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును, తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.

షేర్ చేయి
Read సామెతలు 17

సామెతలు 17:1-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండడం కంటే ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మంచిది. బుద్ధిమంతుడైన సేవకుడు సిగ్గు కలిగించే కొడుకు మీద అధికారం సంపాదించుకుంటాడు. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచు కుంటాడు. వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే. చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు. పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు. మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే. అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు. లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది. ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు. బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది. దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు. మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం. మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు. పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి. దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం. బుద్ధిహీనుడు జ్ఞానం సంపాదించడానికి డబ్బు ఇవ్వడం దేనికి? నేర్చుకునే సామర్థ్యం వాడికి లేదు గదా? స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది. తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు. కలహాలంటే ఇష్టం ఉన్నవాడు పాపాన్ని ప్రేమించేవాడు. తన ఇంటి వాకిళ్ళు ఎత్తు పెంచేవాడు ఎముకలు విరగడానికి కారణం అవుతాడు. దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు. బుద్ధిలేని వాడి తండ్రికి దుఃఖమే. తెలివిలేని వాణ్ణి కన్నవాడికి సంతోషం లేదు. ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి. న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు. వివేకం గలవాడు తన ముఖాన్ని జ్ఞానం కేసి తిప్పుకుంటాడు. బుద్ధిలేని వాడి కళ్ళు భూమి కొనల వైపు తిరిగి ఉంటాయి. బుద్ధిలేని కొడుకు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. కన్న తల్లికి వాడు వేదన కలిగిస్తాడు. మంచి చేసే వారిని శిక్షించడం న్యాయం కాదు. యథార్థత గల ఉదాత్తులను కొరడాలతో కొట్టడం తగదు. జ్ఞానం గలవాడు తక్కువగా మాట్లాడతాడు. అవగాహన గలవాడు శాంత గుణం కలిగి ఉంటాడు. మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.

షేర్ చేయి
Read సామెతలు 17

సామెతలు 17:1-28 పవిత్ర బైబిల్ (TERV)

ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఆ ఇంటినిండా భోజనం ఉండటంకంటె, శాంతి కలిగి భోజనం చేయటానికి ఒక ఎండిపోయిన రొట్టెముక్క ఉంటే చాలు. యజమాని యొక్క సోమరిపోతు కుమారుని మీద తెలివిగల సేవకుడు ఆధిపత్యం సంపాదిస్తాడు. తెలివిగల ఆ సేవకుడు అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము పంచుకొంటాడు. బంగారం, వెండి శుద్ధి చేయబడేందుకు అగ్నిలో వేయబడతాయి. అయితే మనుష్యుల హృదయాలను పవిత్రం చేసేవాడు యెహోవా. దుర్మార్గులు ఇతరులు చెప్పే దుర్మార్గపు సంగతులు వింటారు. అబద్ధాలు చెప్పేవారు కూడా అబద్ధాలు వింటారు. కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమస్యలు ఉన్నవాళ్లను చూచి వారు ఎగతాళి చేస్తారు. వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది సూచిస్తుంది. ఈ దుర్మార్గులు శిక్షించబడుతారు. మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోషపెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి అతిశయిస్తారు. ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడటం జ్ఞానముగల పనికాదు. అదే విధంగా ఒక అధికారి అబద్ధాలు చెప్పటం జ్ఞానముగల పనికాదు. లంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అనుకొంటారు. నీ విషయంలో తప్పు చేసినవాణ్ణి నీవు క్షమిస్తే, మీరు స్నేహితులుగా ఉంటారు. కాని అతడు చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసికొంటూనే ఉంటే, అది మీ స్నేహానికి హాని చేస్తుంది. తెలివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా నేర్చుకొంటాడు. కాని బుద్ధిహీనుడు నూరు పాఠాల తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు. దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతణ్ణి శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తుకొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవటం చాలా ప్రమాదకరం. కాని తెలివి తక్కువ పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుణ్ణి కలుసుకోవటంకంటే అది మేలు. నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి. నీవు వాదం మొదలుపెడ్తే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి. ఏ తప్పూ చేయని వాణ్ణి శిక్షించటం, దోషిని క్షమించటం ఇవి రెండూ యెహోవాకు అసహ్యం. బుద్ధిహీనునికి డబ్బు ఉంటే అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే జ్ఞాని అయ్యేందుకు ఆ డబ్బును బుద్ధిహీనుడు ఉపయోగించడు. స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. నిజమైన సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా నిన్ను బలపరుస్తాడు. మరొకని అప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధిహీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు. జగడాల్లో ఆనందించేవాడు పాపంలోనూ ఆనందిస్తాడు. నిన్ను గూర్చి నీవు అతిశయిస్తే, నీవు కష్టాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది. దుర్మార్గునికి లాభం ఉండదు. అబద్ధాలు చెప్పే వాడికి కష్టాలు ఉంటాయి. తెలివితక్కువ కుమారుడున్న తండ్రికి విచారం. బుద్ధిహీనుని తండ్రికి సంతోషం ఉండదు. సంతోషం ఒక మంచి మందులాంటిది. కాని దు: ఖం ఒక రోగంలాంటిది. దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా డబ్బు తీసికొంటాడు. జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దాన్ని చేసేందుకే తలుస్తూ ఉంటాడు. కాని బుద్ధిహీనుడు ఎంతసేపూ అందనివాటి కోసం కలగంటూ ఉంటాడు. తెలివి తక్కువ కుమారుడు తన తండ్రికి దు: ఖం కలిగిస్తాడు. మరియు తెలివి తక్కువ కుమారుడు తనకు జన్మ నిచ్చిన తల్లికి విచారం కలిగిస్తాడు. ఏ తప్పు చేయని వానిని శిక్షించటం తప్పు. నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడు వారిని శిక్షించటం తప్పు. జ్ఞానముగలవాడు మాటల్ని జాగ్రత్తగా ప్రయోగిస్తాడు. జ్ఞానముగలవాడు త్వరగా కోపగించుకోడు. బుద్ధిహీనుడు కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు జ్ఞానిలా కనిపిస్తాడు. అతడు ఏమీ చెప్పకపోతే జ్ఞానము గలవాడు అని ప్రజలు అనుకొంటారు.

షేర్ చేయి
Read సామెతలు 17

సామెతలు 17:1-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రుచియైన భోజన పదార్థములున్నను కలహముతోకూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడిచేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధి కుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యమువలెనుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదముచేయును. బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు. కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు. సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును. జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.

షేర్ చేయి
Read సామెతలు 17

సామెతలు 17:1-28 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)