సామెతలు 13:1-25

సామెతలు 13:1-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తండ్రి క్రమశిక్షణకు లోబడిన కుమారుడు వివేకం గలవాడు. బుద్ధి లేనివాడు దిద్దుబాటుకు తల వంచడు. మనిషి తన నోటి నుంచి వచ్చే మాటల వలన ప్రతిఫలం పొందుతాడు. నమ్మకద్రోహులు తమ దుష్ట క్రియల చేత నాశనం తెచ్చుకుంటారు. తన నోటిని అదుపులో ఉంచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. వ్యర్థంగా మాట్లాడే వాడు నాశనం కొని తెచ్చుకుంటాడు. సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు. నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు. నిజాయితీపరులకు వారి యథార్థ ప్రవర్తన కాపుదలగా ఉంటుంది. పాపులు తమ భక్తిహీనత వల్ల నాశనమౌతారు. తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు. ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు. నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది. మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు. కోరుకున్నది జరగకపోతే హృదయం క్షీణిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం వంటిది. హితబోధను తిరస్కరించేవాడు దాన్ని బట్టి శిక్షకు పాత్రుడౌతాడు. ఆజ్ఞల పట్ల భయభక్తులు చూపి వాటిని ఆచరించేవాడు తగిన ఫలం పొందుతాడు. జ్ఞానుల ఉపదేశం జీవం కలిగించే ఊట. మనుషులు దాని మూలంగా మరణ బంధకాల నుండి తప్పించుకుంటారు. మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి. వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు. దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు. క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు. కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు. జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు. కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది. పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు. బెత్తం వాడకుండా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న తండ్రి అతనికి శత్రువు వంటివాడు. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి తప్పకుండా శిక్షిస్తాడు. ఉత్తముడు కడుపునిండా భోజనం చేస్తాడు. భక్తిహీనులు తినడానికి ఏమీ మిగలదు.

షేర్ చేయి
Read సామెతలు 13

సామెతలు 13:1-25 పవిత్ర బైబిల్ (TERV)

ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చెబుతాడో, దానిని జాగ్రత్తగా వింటాడు. కాని గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్మడు. మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు. తాను చెప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకొంటాడు. కాని ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు. బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కాని అతడు వాటిని ఎన్నటికీ పొందలేడు. కాని కష్టపడి పని చేసేవాళ్లు, తాము కోరుకొనే వాటిని పొందుతారు. మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు. మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం కాపాడుతుంది. కాని పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది. కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, కాని వారికి ఏమి వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటిస్తారు, కాని వాస్తవానికి వారు ధనికులు. ఒక ధనికుడు తనప్రాణం కాపాడుకొనేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో. కాని పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ వుండవు. ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా ఉంటాడు. కాని దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు. ఇతరులకంటె తామే మంచివాళ్లము అనుకొనే మనుష్యులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు. డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకొంటాడు. నిరీక్షణ లేకపోతే హృదయానికి దు: ఖం. నీవు కోరుకొన్నది సంభవిస్తే, అప్పుడు ఆనంద భరితుడవు. ఒక వ్యక్తికి ఇతరులు సహాయం చేయటానికి ప్రయత్నించినప్పుడు అతడు వినిపించుకోకపోతే, అప్పుడు అతడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. అయితే ఇతరులు తనకు చెప్పిన సంగతులను గౌరవించేవాడు బహుమానం పొందుతాడు. జ్ఞానముగల మనిషి యొక్క ఉపదేశాలు జీవాన్ని ఇస్తాయి. ఆ మాటలు మరణ బంధకాల నుండి తప్పించుకొనుటకు సహాయం చేస్తాయి. తెలివిగల మనిషిని మనుష్యులు గౌరవిస్తారు. కాని ఒక వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది. జ్ఞానముగల మనిషి ఏదైనా చేయకముందే అతడు ఆలోచిస్తాడు. అయితే బుద్దిహీనుడు చేసే బుద్దిహీనత వలన అతడు మూర్ఖుడౌతాడు. ఒక వార్తాహరుడు నమ్మజాలని వాడైతే, అప్పుడు అతని చుట్టూ కష్టం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి నమ్మదగిన వాడైతే శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి తన తప్పుల మూలంగా నేర్చుకొనేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు పేదవాడై, సిగ్గుపడతాడు. కాని ఒక మనిషి విమర్శించడినప్పుడు, శిక్షించబడినప్పుడు వినిపించుకొంటే లాభం పొందుతాడు. ఒక మనిషి ఏదైనా కోరుకొని దానిని పొందితే, అతనికి చాలా సంతోషం. కాని మూర్ఖులు కీడునే కోరుకొంటారు. వారు మారుటకు అంగీకరించరు. జ్ఞానముగల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. కాని బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకొంటే అప్పుడు నీవు కష్టాల్లో పడతావు. పాపులు ఎక్కడికి వెళ్లినా కష్టం వారిని తరుముతుంది. కాని మంచివాళ్లకు మంచి సంగతులు జరుగుతాయి. మంచి మనిషి దగ్గర అతడు తన పిల్లలకు, మనవలకు ఇచ్చేందుకు ఐశ్వర్యం ఉంటుంది. చివరికి చెడ్డవాళ్లకు ఉన్నవి అన్నీ మంచివాళ్ల పాలవుతాయి. ఒక పేదవానికి విస్తారమైన ఆహారం పండించగల మంచి భూమి ఉండవచ్చును. కాని అతడు చెడు నిర్ణయాలు చేసి, ఆకలితో ఉంటాడు. ఒక వ్యక్తి తన పిల్లలను నిజంగా ప్రేమిస్తే, వారు తప్పు చేసినప్పుడు అతడు వారిని సరిదిద్దుతాడు. నీవు నీ కుమారుణ్ణి ప్రేమిస్తే, అతనికి సరైన మార్గం నేర్పించేందుకు నీవు జాగ్రత్తగా ఉంటావు. మంచి వాళ్లకు నిజంగా వారికి కావాల్సినవి ఉంటాయి. కాని దుర్మార్గునికి అవసరత కలిగివుంటుంది.

షేర్ చేయి
Read సామెతలు 13

సామెతలు 13:1-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కల్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును. కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును ఆజ్ఞవిషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధమువంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలితీర భోజనముచేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.

షేర్ చేయి
Read సామెతలు 13

సామెతలు 13:1-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు, కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు. తమ పెదవుల ఫలం నుండి ప్రజలు మేలైన వాటిని ఆస్వాదిస్తారు, కాని నమ్మకద్రోహులు హింస పట్ల ఆకలిగొని ఉంటారు. తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు, కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు. సోమరి ఆకలి ఎన్నటికి తీరదు, కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు. నీతిమంతులు అబద్ధమైన దానిని అసహ్యించుకుంటారు, దుర్మార్గులు తమను తాము దుర్గంధం చేసుకుంటారు తమ మీదికి అవమానం తెచ్చుకుంటారు. నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది. కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు; మరికొందరు బాగా ధనము కలిగి ఉండి కూడా, పేదవారిగా నటిస్తారు. ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు, కాని పేదవాడు బెదిరింపు మాటలను వినడు. నీతిమంతుల వెలుగు అంతకంతకు ప్రకాశించును, కాని దుర్మార్గుల దీపం ఆరిపోతుంది. గర్వము ఉన్నచోట తగాదా ఉంటుంది, కాని సలహా తీసుకునేవారికి జ్ఞానము దొరుకుతుంది. నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది, కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు. వాయిదా వేయబడిన ఆశ హృదయానికి జబ్బు కలిగిస్తుంది, అయితే కోరిక తీరుట జీవవృక్షము. బోధను ఎగతాళి చేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు, కాని ఆజ్ఞను గౌరవించేవారు ఫలం పొందుతారు. జ్ఞానుల బోధ ఒక జీవపుఊట, అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది. మంచి తీర్పు దయను గెలుస్తుంది, కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది. వివేకులైనవారందరు తెలివితో వ్యవహరిస్తారు, కాని మూర్ఖులు వారి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తారు. దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు, నమ్మకమైన రాయబారులు స్వస్థత కలిగిస్తారు. శిక్షను తిరస్కరించేవారికి అవమానం దారిద్ర్యం కలుగుతాయి అయితే దిద్దుబాటును స్వీకరించేవారు ఘనత పొందుతారు. ఆశ తీరుట వలన ప్రాణానికి తీపి చెడుతనాన్ని విడిచిపెట్టడం బుద్ధిలేనివారికి అసహ్యము. జ్ఞానులతో స్నేహం చేసేవారు జ్ఞానులవుతారు బుద్ధిలేనివారితో స్నేహం చేసేవారు చెడిపోతారు. కష్టం పాపులను వెంటాడుతుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు, పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది. దున్నబడని క్రొత్త భూమి పేదవారికి పంటనిస్తుంది కాని అన్యాయస్థులు రు. బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడు. నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు, కానీ దుష్టులైన వారి కడుపు నిండదు.

షేర్ చేయి
Read సామెతలు 13