సామెత 13
13
1తండ్రి క్రమశిక్షణకు లోబడిన కుమారుడు వివేకం గలవాడు. బుద్ధి లేనివాడు దిద్దుబాటుకు తల వంచడు.
2మనిషి తన నోటి నుంచి వచ్చే మాటల వలన ప్రతిఫలం పొందుతాడు. నమ్మకద్రోహులు తమ దుష్ట క్రియల చేత నాశనం తెచ్చుకుంటారు.
3తన నోటిని అదుపులో ఉంచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. వ్యర్థంగా మాట్లాడే వాడు నాశనం కొని తెచ్చుకుంటాడు.
4సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.
5నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.
6నిజాయితీపరులకు వారి యథార్థ ప్రవర్తన కాపుదలగా ఉంటుంది. పాపులు తమ భక్తిహీనత వల్ల నాశనమౌతారు.
7తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు.
8ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు.
9నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది.
10గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.
11మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.
12కోరుకున్నది జరగకపోతే హృదయం క్షీణిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం వంటిది.
13హితబోధను తిరస్కరించేవాడు దాన్ని బట్టి శిక్షకు పాత్రుడౌతాడు. ఆజ్ఞల పట్ల భయభక్తులు చూపి వాటిని ఆచరించేవాడు తగిన ఫలం పొందుతాడు.
14జ్ఞానుల ఉపదేశం జీవం కలిగించే ఊట. మనుషులు దాని మూలంగా మరణ బంధకాల నుండి తప్పించుకుంటారు.
15మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి.
16వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు.
17దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు.
18క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు.
19కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు.
20జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.
21కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది.
22న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది.
23పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు.
24బెత్తం వాడకుండా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న తండ్రి అతనికి శత్రువు వంటివాడు. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి తప్పకుండా శిక్షిస్తాడు.
25ఉత్తముడు కడుపునిండా భోజనం చేస్తాడు. భక్తిహీనులు తినడానికి ఏమీ మిగలదు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెత 13: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.