సామెత 13:1-25

సామెత 13:1-25 IRVTEL

తండ్రి క్రమశిక్షణకు లోబడిన కుమారుడు వివేకం గలవాడు. బుద్ధి లేనివాడు దిద్దుబాటుకు తల వంచడు. మనిషి తన నోటి నుంచి వచ్చే మాటల వలన ప్రతిఫలం పొందుతాడు. నమ్మకద్రోహులు తమ దుష్ట క్రియల చేత నాశనం తెచ్చుకుంటారు. తన నోటిని అదుపులో ఉంచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. వ్యర్థంగా మాట్లాడే వాడు నాశనం కొని తెచ్చుకుంటాడు. సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు. నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు. నిజాయితీపరులకు వారి యథార్థ ప్రవర్తన కాపుదలగా ఉంటుంది. పాపులు తమ భక్తిహీనత వల్ల నాశనమౌతారు. తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు. ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు. నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది. మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు. కోరుకున్నది జరగకపోతే హృదయం క్షీణిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం వంటిది. హితబోధను తిరస్కరించేవాడు దాన్ని బట్టి శిక్షకు పాత్రుడౌతాడు. ఆజ్ఞల పట్ల భయభక్తులు చూపి వాటిని ఆచరించేవాడు తగిన ఫలం పొందుతాడు. జ్ఞానుల ఉపదేశం జీవం కలిగించే ఊట. మనుషులు దాని మూలంగా మరణ బంధకాల నుండి తప్పించుకుంటారు. మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి. వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు. దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు. క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు. కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు. జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు. కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది. న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది. పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు. బెత్తం వాడకుండా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న తండ్రి అతనికి శత్రువు వంటివాడు. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి తప్పకుండా శిక్షిస్తాడు. ఉత్తముడు కడుపునిండా భోజనం చేస్తాడు. భక్తిహీనులు తినడానికి ఏమీ మిగలదు.