సంఖ్యాకాండము 21:10-20

సంఖ్యాకాండము 21:10-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి. అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు. కాబట్టి –యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది. అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి– బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.

సంఖ్యాకాండము 21:10-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఓబోతులో శిబిరం వేసుకున్నారు. ఓబోతులోనుంచి వారు ప్రయాణం చేసి తూర్పు వైపు, అంటే మోయాబుకు ఎదురుగా ఉన్న బంజరు భూమి ఈయ్యె అబారీము దగ్గర శిబిరం వేసుకున్నారు. అక్కడనుంచి వారు ప్రయాణం చేసి, జెరెదు లోయలో శిబిరం వేసుకున్నారు. అక్కడనుంచి వారు ప్రయాణం చేసి బంజరు భూమిలో అర్నోను నది అవతల శిబిరం వేసుకున్నారు. ఆ నది అమోరీయుల దేశ సరిహద్దులనుంచి ప్రవహిస్తుంది. అర్నోను నది మోయాబుకు, అమోరీయులకు మధ్య ఉన్న మోయాబు సరిహద్దు. ఆ కారణంగా యెహోవా యుద్ధాల గ్రంథంలో “సుఫాలో ఉన్న వాహేబు, అర్నోను లోయలు, ఆరు అనే స్థలం వరకూ ఉన్న అర్నోను లోయలు, మోయాబు సరిహద్దుకు దగ్గరగా ఉన్న పల్లపు లోయలు” అని రాసి ఉంది. అక్కడనుంచి వారు బెయేరుకు వెళ్ళారు. అక్కడ ఉన్న బావి దగ్గర యెహోవా మోషేతో “ప్రజలను సమకూర్చు. నేను వాళ్లకు నీళ్ళు ఇస్తాను” అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు. “బావీ, పైకి ఉబుకు! ఆ బావిని కీర్తించండి. నాయకులు దాన్ని తవ్వారు. వారు తమ అధికార దండంతో, చేతికర్రలతో ప్రజల నాయకులు దాన్ని తవ్వారు.” వారు ఆ ఎడారిలోనుంచి మత్తానుకూ, మత్తాను నుంచి నహలీయేలుకూ, నహలీయేలు నుంచి బామోతుకూ, మోయాబు దేశంలోని లోయలో ఉన్న బామోతు నుంచి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండ దగ్గరికి వచ్చారు.

సంఖ్యాకాండము 21:10-20 పవిత్ర బైబిల్ (TERV)

ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కొన సాగించారు. ఓబోతు అనే చోట వారు నివాసం చేసుకొనిరి. తర్వాత ఆ ప్రజలు ఓబోతునుండి ఈయ్యె అబారీము వెళ్లారు. ఇది తూర్పున మోయాబు సమీపంగా అరణ్యంలో ఉంది. తర్వాత ప్రజలు ఆ స్థలం విడిచి, జెరెదు లోయకు ప్రయాణం చేసారు. అక్కడ నివాసాలు చేసుకొనిరి. మళ్లీ ప్రజలు అర్నోను లోయకువచ్చి, అక్కడికి సమీపంలో నివాసం చేసుకొనిరి. ఇవి అమోరీయ దేశానికి దగ్గర్లో ఉన్న అరణ్యంలో ఉంది. మోయాబు ప్రజలను అమోరీ ప్రజలకు అర్నోనులోయ సరిహద్దు. అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో ఇలా కనబడుతుంది. “సుప్పాలోని వాహేబు, అర్నోను లోయలు, ఆరు అను పట్టణం వరకుగల లోయల పక్క కొండలు. ఈ స్థలాలు మోయాబు సరిహద్దులో ఉన్నాయి.” ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలం విడిచి బెయేరు చేరారు. ఈ స్థలంలో ఒక బావి ఉంది. యెహోవా “ప్రజలను ఇక్కడికి తీసుకొనిరా. నేను వారికి నీళ్లిస్తాను” అని మోషేతో చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు, “బావీ, ఉప్పొంగి ప్రవహించు, దానిగూర్చి పాడండి! మహాత్ములు ఈ బావి తవ్వారు. ప్రముఖ నాయకులు ఈ బావి తవ్వారు. అధికార దండములతో, కర్రలతో వారు ఈ బావి తవ్వారు. అరణ్యంలో ఇది ఒక కానుక.” మత్తాన అని పిలువబడే ఈ బావి దగ్గర ప్రజలు ఉన్నారు. అప్పుడు ప్రజలు మత్తానానుండి నహలీయేలుకు ప్రయాణం చేసారు. మళ్లీ వారు నహలీయేలు నుండి బామోతుకు ప్రయాణం చేసారు. బామోతునుండి మోయాబు లోయకు ప్రజలు ప్రయాణం చేసారు. ఇక్కడ ఎడారికి ఎదురుగా పిస్గా శిఖరం కనబడుతుంది.

సంఖ్యాకాండము 21:10-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి, ఓబోతులో దిగారు. తర్వాత ఓబోతు నుండి ప్రయాణం చేసి, ఈయ్యె-అబారీములో దిగారు. అది మోయాబుకు ఎదురుగా, సూర్యోదయ దిక్కున ఉన్న అరణ్యము. అక్కడినుండి ప్రయాణం చేసి జెరెదు లోయలో దిగారు. వారు అక్కడినుండి బయలుదేరి, అమోరీయుల భూభాగంలో విస్తరించి ఉన్న అరణ్యంలో ఉన్న అర్నోను ప్రక్కన విడిది చేశారు. అర్నోను మోయాబు అమోరీయుల మధ్య మోయాబు సరిహద్దు. అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో: “సుఫాలోని వాహేబు, అర్నోను లోయలు ఆరు పట్టణం వరకు ఉన్న పల్లపు లోయలు మోయాబు సరిహద్దులో ఉన్నాయి” అని వ్రాయబడి ఉంది. అక్కడినుండి వారు బెయేర్‌కు వెళ్లారు, ఈ బావి గురించి యెహోవా మోషేతో, “ప్రజలను సమకూర్చు, నేను వారికి నీళ్లిస్తాను” అని అన్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు: “ఓ బావి ఉప్పొంగు! దాని గురించి పాడండి. రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు, ప్రజల సంస్థానాధిపతులు తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.” తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు, మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు, బామోతు నుండి మోయాబు లోయకు వెళ్లారు. అక్కడే పిస్గా పర్వతం ఉంది.