సంఖ్యాకాండము 21
21
1ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణదిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందిరిని చెరపట్టగా 2ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని – నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి. 3యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా#21:3 నిర్మూలము. అను పేరు పెట్టబడెను.
4వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. 5కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి– ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. 6అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. 7కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి–మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. 8మోషే ప్రజలకొరకు ప్రార్థనచేయగా యెహోవా–నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకు నని మోషేకు సెలవిచ్చెను. 9కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను. 10తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి. 11ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి. 12అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి. 13అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు. 14-15కాబట్టి –యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది. 16అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది. 17అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి–
బావీ ఉబుకుము. దాని కీర్తించుడి
బావీ; యేలికలు దాని త్రవ్విరి
18తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను
జనుల అధికారులు దాని త్రవ్విరి.
19వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును 20మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.
21ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి–మమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము. 22మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి. 23అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను. 24ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలి మేర దుర్గమమైనది. 25అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి. 26హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను. 27కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు–
హెష్బోనుకు రండి
సీహోను పట్టణమును కట్టవలెను
దానిని స్థాపింపవలెను
28హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను
సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను
అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను
అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.
29మోయాబూ, నీకు శ్రమ
కెమోషు జనులారా, మీరు నశించితిరి
తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను
అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను.
30వాటిమీద గురిపెట్టి కొట్టితిమి
దీబోనువరకు హెష్బోను నశించెను
నోఫహువరకు దాని పాడు చేసితిమి.
అగ్నివలన మేదెబావరకు పాడుచేసితిమి.
31అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. 32మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. 33వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషానురాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా 34యెహోవా మోషేతో నిట్లనెను–అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. 35కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యాకాండము 21: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.