సంఖ్యాకాండము 20
20
1మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. 2ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందునవారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. 3జనులు మోషేతో వాదించుచు–అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు 4అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? 5ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి. 6అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. 7అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను 8–నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. 9యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను. 10తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను. 11అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. 12అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. 13అవి మెరీబా#20:13 అనగా–వివాదము. జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.
14మోషే కాదేషునుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి–నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగున దేమనగా–మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది; 15మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలాదినములు ఐగుప్తులో నివసించితిమి; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి. 16మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము. 17మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజమార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపున కైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను. 18ఎదోమీయులు –నీవు నా దేశములోబడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా 19ఇశ్రాయేలీయులు–మేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు–నీవు రానేకూడదనెను. 20అంతట ఎదోము బహుజనముతోను మహా బలముతోను బయలుదేరి వారి కెదురుగా వచ్చెను. 21ఎదోము ఇశ్రాయేలు తన పొలి మేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి.
22అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరు కొండకు వచ్చెను. 23యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను 24–అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. 25-26నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండయెక్కి, అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. 27యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి. 28మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండశిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగివచ్చిరి. 29అహరోను చనిపోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యాకాండము 20: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.