సంఖ్యాకాండము 21:10-20

సంఖ్యాకాండము 21:10-20 TERV

ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కొన సాగించారు. ఓబోతు అనే చోట వారు నివాసం చేసుకొనిరి. తర్వాత ఆ ప్రజలు ఓబోతునుండి ఈయ్యె అబారీము వెళ్లారు. ఇది తూర్పున మోయాబు సమీపంగా అరణ్యంలో ఉంది. తర్వాత ప్రజలు ఆ స్థలం విడిచి, జెరెదు లోయకు ప్రయాణం చేసారు. అక్కడ నివాసాలు చేసుకొనిరి. మళ్లీ ప్రజలు అర్నోను లోయకువచ్చి, అక్కడికి సమీపంలో నివాసం చేసుకొనిరి. ఇవి అమోరీయ దేశానికి దగ్గర్లో ఉన్న అరణ్యంలో ఉంది. మోయాబు ప్రజలను అమోరీ ప్రజలకు అర్నోనులోయ సరిహద్దు. అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో ఇలా కనబడుతుంది. “సుప్పాలోని వాహేబు, అర్నోను లోయలు, ఆరు అను పట్టణం వరకుగల లోయల పక్క కొండలు. ఈ స్థలాలు మోయాబు సరిహద్దులో ఉన్నాయి.” ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలం విడిచి బెయేరు చేరారు. ఈ స్థలంలో ఒక బావి ఉంది. యెహోవా “ప్రజలను ఇక్కడికి తీసుకొనిరా. నేను వారికి నీళ్లిస్తాను” అని మోషేతో చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు, “బావీ, ఉప్పొంగి ప్రవహించు, దానిగూర్చి పాడండి! మహాత్ములు ఈ బావి తవ్వారు. ప్రముఖ నాయకులు ఈ బావి తవ్వారు. అధికార దండములతో, కర్రలతో వారు ఈ బావి తవ్వారు. అరణ్యంలో ఇది ఒక కానుక.” మత్తాన అని పిలువబడే ఈ బావి దగ్గర ప్రజలు ఉన్నారు. అప్పుడు ప్రజలు మత్తానానుండి నహలీయేలుకు ప్రయాణం చేసారు. మళ్లీ వారు నహలీయేలు నుండి బామోతుకు ప్రయాణం చేసారు. బామోతునుండి మోయాబు లోయకు ప్రజలు ప్రయాణం చేసారు. ఇక్కడ ఎడారికి ఎదురుగా పిస్గా శిఖరం కనబడుతుంది.