సంఖ్యాకాండము 20:1-13
సంఖ్యాకాండము 20:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందునవారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు–అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను –నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను. అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.
సంఖ్యాకాండము 20:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అనే నిర్జన బీడు ప్రాంతానికి వెళ్ళారు. వారు కాదేషులో శిబిరం వేసుకున్నారు. అక్కడ మిర్యాము చనిపోయింది. ఆమెను అక్కడ పాతిపెట్టారు. ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు. ప్రజలు మోషేను విమర్శిస్తూ “మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది! మేమూ మా పశువులూ చనిపోడానికి యెహోవా సమాజాన్ని ఈ నిర్జన బీడు ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చావు? ఈ భయంకరమైన ప్రాంతానికి మమ్మల్ని తీసుకు రావడానికి ఐగుప్తులోనుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఈ ప్రాంతంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు” అన్నారు. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుంచి సన్నిధి గుడారపు ద్వారం లోకి వెళ్లి సాగిలపడినప్పుడు, యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది. అప్పుడు యెహోవా మోషేతో, “నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి” అన్నాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు. అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నన్ను నమ్మలేదు, నా పవిత్రత నిలబెట్టలేదు గనక, నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్లలేరు” అన్నాడు. ఈ నీళ్ళ ప్రాంతానికి మెరీబా అని పేరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రత చూపించుకున్నాడు.
సంఖ్యాకాండము 20:1-13 పవిత్ర బైబిల్ (TERV)
మొదటి నెల ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేషులో నివాసం చేసారు. మిర్యాము చనిపోయి, అక్కడే పాతి పెట్టబడింది. ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే, అహరోనులతో ఫిర్యాదు చేయటానికి సమావేశమయ్యారు. ప్రజలు మోషేతో వాదించారు. వారు ఇలా అన్నారు: “ఒక వేళ మా సోదరుల్లా మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటేబాగుండేది. యెహోవా ప్రజలను నీవు ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశువులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా? ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పనికిమాలిన చోటుకు మమ్మల్ని నీవెందుకు తీసుకువచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు. అంజూరపు పండ్లు, ద్రాక్షాపండ్లు, దానిమ్మ పండ్లు ఏమీ లేవు. కనీసం తాగటానికి నీళ్లు కూడ లేవు.” కనుక మోషే, అహరోను ఆ జనాన్ని విడిచి, సన్నిధి గుడార ద్వారం దగ్గరకు వెళ్లారు. వారు సాష్టాంగపడగా యెహోవా మహిమ ప్రత్యక్షమయింది. యెహోవా మోషేతో మాట్లాడాడు: “నీ సోదరుడు అహరోనును, ఈ జనాన్ని తీసుకుని ఆ బండ దగ్గరకు వెళ్లు నీ కర్ర కూడా తీసుకుని వెళ్లు. ఆ బండ ఎదుట ప్రజలతో మాట్లాడు. అప్పుడు ఆ బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, పశువులకు నీవు ఆ నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు ఆయన. కనుక యెహోవా చెప్పిన ప్రకారం మోషే ఆయన ఎదుటనుండి కర్ర తీసుకున్నాడు. అప్పుడు ప్రజలంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే, “మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము” అన్నాడు. మోషే తన చేయి పై కెత్తి రెండుసార్లు ఆ బండను కొట్టాడు. బండనుండి నీళ్లు ప్రవహించటం మొదలయ్యింది. ప్రజలు, పశువులు ఆ నీళ్లు త్రాగారు. అయితే మోషే, అహరోనులతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా చుట్టూచేరారు. కానీ మీరు నాకు ఘనత చూపలేదు. నీళ్లను ప్రవహింప జేసిన శక్తి నా దగ్గరనుండి వచ్చిందని ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూపించలేదు. మీరు నన్ను నమ్ముకొన్నట్లుగా మీరు ప్రజలకు చూపించలేదు. ఆ ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇస్తాను. అయితే వాళ్లను ఆ దేశంలోనికి నడిపించేవాళ్లు మాత్రం మీరు కారు.” ఈ స్థలం మెరీబా జలాలు అని పిలువబడింది. ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో వాదించారు. ఆయన పవిత్రుడని యెహోవా ఇక్కడనే వారికి చూపించాడు.!
సంఖ్యాకాండము 20:1-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సంవత్సరం మొదటి నెలలో ఇశ్రాయేలు సమాజమంతా సీను ఎడారికి చేరి కాదేషులో దిగారు. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది. అయితే సమాజానికి నీళ్లు లేవు కాబట్టి ప్రజలు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా గుమికూడారు. వారు మోషేతో గొడవపడుతూ, “మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే బాగుండేది! యెహోవా సమాజాన్ని ఈ అరణ్యంలోనికి ఎందుకు తెచ్చావు? మేము, మా పశువులు చావాలనా? మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఈ భయంకరమైన చోటికి ఎందుకు తీసుకువచ్చారు? దీనిలో ధాన్యాలు లేదా అంజూరాలు, ద్రాక్షలు లేదా దానిమ్మలు లేవు. త్రాగడానికి నీరు దొరకలేదు!” మోషే అహరోనులు సమాజం నుండి సమావేశ గుడారం దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం వారికి కనిపించింది. యెహోవా మోషేతో, “చేతికర్రను పట్టుకుని, నీవు నీ అన్న అహరోను కలిసి సమాజాన్ని సమకూర్చి, వారు చూస్తుండగా ఆ బండను ఆజ్ఞాపించు, ఆ బండ నుండి నీళ్లు వస్తాయి. వారు వారి పశువులు త్రాగడానికి సమాజం కోసం నీవు ఆ బండ నుండి నీళ్లను రప్పిస్తావు.” కాబట్టి మోషే ఆయన ఆజ్ఞ ప్రకారం యెహోవా సన్నిధి నుండి తన చేతికర్రను తీసుకున్నాడు. అతడు, అహరోను సమాజాన్ని బండ ఎదుట సమకూర్చారు మోషే, “ద్రోహులారా! వినండి. ఈ బండలో నుండి మీ కోసం నీళ్లు రప్పించాలా?” అప్పుడు మోషే చేయి ఎత్తి రెండు సార్లు కర్రతో బండను కొట్టాడు. వెంటనే నీళ్లు ఉబుకుతూ వచ్చాయి, సమాజ ప్రజలు, వారి పశువులతో సహా త్రాగారు. అయితే యెహోవా మోషే అహరోనులతో, “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నా పరిశుద్ధతను ఘనపరచడానికి నన్ను నమ్మలేదు కాబట్టి మీరు ఈ సమాజాన్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్లరు” అని అన్నారు. ఇవి మెరీబా జలాలు. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోవాతో గొడవపడ్డారు, యెహోవా తన పరిశుద్ధతను నిరూపించుకున్నారు.