సంఖ్యా 20

20
బండ నుండి నీళ్లు
1సంవత్సరం మొదటి నెలలో ఇశ్రాయేలు సమాజమంతా సీను ఎడారికి చేరి కాదేషులో దిగారు. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది.
2అయితే సమాజానికి నీళ్లు లేవు కాబట్టి ప్రజలు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా గుమికూడారు. 3వారు మోషేతో గొడవపడుతూ, “మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే బాగుండేది! 4యెహోవా సమాజాన్ని ఈ అరణ్యంలోనికి ఎందుకు తెచ్చావు? మేము, మా పశువులు చావాలనా? 5మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఈ భయంకరమైన చోటికి ఎందుకు తీసుకువచ్చారు? దీనిలో ధాన్యాలు లేదా అంజూరాలు, ద్రాక్షలు లేదా దానిమ్మలు లేవు. త్రాగడానికి నీరు దొరకలేదు!”
6మోషే అహరోనులు సమాజం నుండి సమావేశ గుడారం దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం వారికి కనిపించింది. 7యెహోవా మోషేతో, 8“చేతికర్రను పట్టుకుని, నీవు నీ అన్న అహరోను కలిసి సమాజాన్ని సమకూర్చి, వారు చూస్తుండగా ఆ బండను ఆజ్ఞాపించు, ఆ బండ నుండి నీళ్లు వస్తాయి. వారు వారి పశువులు త్రాగడానికి సమాజం కోసం నీవు ఆ బండ నుండి నీళ్లను రప్పిస్తావు.”
9కాబట్టి మోషే ఆయన ఆజ్ఞ ప్రకారం యెహోవా సన్నిధి నుండి తన చేతికర్రను తీసుకున్నాడు. 10అతడు, అహరోను సమాజాన్ని బండ ఎదుట సమకూర్చారు మోషే, “ద్రోహులారా! వినండి. ఈ బండలో నుండి మీ కోసం నీళ్లు రప్పించాలా?” 11అప్పుడు మోషే చేయి ఎత్తి రెండు సార్లు కర్రతో బండను కొట్టాడు. వెంటనే నీళ్లు ఉబుకుతూ వచ్చాయి, సమాజ ప్రజలు, వారి పశువులతో సహా త్రాగారు.
12అయితే యెహోవా మోషే అహరోనులతో, “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నా పరిశుద్ధతను ఘనపరచడానికి నన్ను నమ్మలేదు కాబట్టి మీరు ఈ సమాజాన్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్లరు” అని అన్నారు.
13ఇవి మెరీబా జలాలు. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోవాతో గొడవపడ్డారు, యెహోవా తన పరిశుద్ధతను నిరూపించుకున్నారు.
ఇశ్రాయేలు ఎదోము వారి మధ్య నుండి వెళ్లడానికి వారు తిరస్కరించారు
14మోషే కాదేషు నుండి ఎదోము రాజు దగ్గరకు ఈ వర్తమానంతో దూతలను పంపాడు:
“నీ సహోదరుడైన ఇశ్రాయేలు ఇలా చెప్తున్నాడు: మా మీదికి వచ్చిన కష్టాలన్నిటి గురించి నీకు తెలుసు. 15మా పూర్వికులు ఈజిప్టుకు వెళ్లారు. చాలా కాలం మేమక్కడ ఉన్నాము. ఈజిప్టువారు మా పట్ల, మా పూర్వికుల పట్ల దారుణంగా ప్రవర్తించారు, 16అయితే మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన మా మొర ఆలకించాడు దేవదూతను పంపి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు.
“ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాము, ఈ పట్టణం మీ సరిహద్దుల చివర ఉంది. 17దయచేసి మమ్మల్ని మీ దేశం మార్గం ద్వారా వెళ్లనివ్వండి. మేము మీ పొలాలు, ద్రాక్షతోటల్లో నుండి వెళ్లము, మీ బావులలోని నీళ్లు త్రాగము. రాజమార్గంలోనే సాగిపోతాము. ఈ దేశం పొలిమేర దాటే వరకు కుడికి గాని, ఎడమకు గాని తిరగకుండా వెళ్తాము.”
18కానీ ఎదోము రాజు ఇలా ఆజ్ఞాపించారు:
“మీరు ఇక్కడినుండి వెళ్లకూడదు. వెళ్లడానికి ప్రయత్నిస్తే ఖడ్గంతో మీపై దాడి చేస్తాము.”
19ఇశ్రాయేలు ప్రజలు తిరిగి కబురు పంపారు:
“మేము రాజమార్గంలోనే సాగిపోతాము. మేము మా పశువులు నీళ్లు త్రాగితే దానికి వెల చెల్లిస్తాము. మేము కేవలం కాలినడకతో దాటి వెళ్తాం అంతే ఇంకేమి లేదు.”
20వారు తిరిగి జవాబిచ్చారు:
“మీరు దాటి వెళ్లకూడదు.”
ఎదోము వారు వారిని ఎదుర్కోడానికి, శక్తిగల పెద్దబలగంతో వచ్చారు. 21ఎదోము వారు ఇశ్రాయేలీయులను తమ సరిహద్దులు దాటనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు అక్కడినుండి తిరిగిపోయారు.
అహరోను మరణం
22ఇశ్రాయేలు సమాజమంత కాదేషు నుండి ప్రయాణమై హోరు పర్వతానికి చేరారు. 23ఎదోము సరిహద్దు దగ్గర ఉన్న హోరు పర్వతం దగ్గర, యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పారు, 24“అహరోను తన పూర్వికుల దగ్గర చేర్చబడతాడు. మీరిద్దరు మెరీబా నీళ్ల దగ్గర నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించడు. 25నీవు అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు పర్వతం పైకి తీసుకెళ్లు. 26అహరోను వస్త్రాలు తీసి, అతని కుమారుడైనా ఎలియాజరుకు తొడిగించు. అక్కడే అహరోను చనిపోయి తన పూర్వికుల దగ్గర చేర్చబడతాడు.”
27యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉండగా వారు హోరు పర్వతం ఎక్కారు. 28మోషే అహరోను వస్త్రాలు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను ఆ పర్వత శిఖరం మీదనే చనిపోయాడు. మోషే ఎలియాజరు పర్వతం దిగి వచ్చారు, 29సమాజమంతా అహరోను చనిపోయాడని ఎప్పుడైతే తెలుసుకుందో, ఇశ్రాయేలీయులంతా ముప్పై రోజులు అహరోను కోసం సంతాపం పాటించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యా 20: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి