మార్కు 2:1-17

మార్కు 2:1-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

కొన్ని రోజుల తర్వాత, యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఆయన ఇంటికి వచ్చారని ప్రజలకు తెలిసింది. వారు పెద్ద సంఖ్యలో కూడి వచ్చారు కనుక తలుపు బయట నిలబడడానికి కూడ స్థలం లేదు, అయినా ఆయన వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు, నలుగురు అతన్ని మోసుకొచ్చారు. కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వాన్ని యేసు దగ్గరకు తీసుకొని వెళ్లలేక, సరిగ్గా యేసు ఉన్న చోట ఇంటి పైకప్పును విప్పి పక్షవాతంగల వాన్ని చాపపై పడుకోబెట్టి కిందికి దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, పక్షవాతం గలవానితో, “కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు. కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చొని ఉన్నారు, వారు తమలో తాము, “ఈ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇతడు దైవదూషణ చేస్తున్నాడు! దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచిస్తున్నారు. వారు తమ హృదయాల్లో ఆలోచిస్తున్నది ఇదే అని వెంటనే యేసు తన ఆత్మలో గ్రహించి వారితో, “మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభం: ఈ పక్షవాతం గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడమా లేక, ‘నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు’ అని చెప్పడమా? అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్నా. నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. అతడు లేచి, తన పరుపెత్తుకొని అందరూ చూస్తుండగానే నడిచి వెళ్లాడు. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడి, “ఇలాంటివి ఇంతకు ముందు మేము ఎప్పుడు చూడలేదు!” అని చెప్తూ దేవుని స్తుతించారు. యేసు మరొకసారి సరస్సు తీరానికి వెళ్లారు. అక్కడ ఒక గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వచ్చింది, ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన మార్గంలో నడుస్తుండగా, పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవిని చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు, లేవి లేచి ఆయనను వెంబడించాడు. లేవి ఇంట్లో యేసు భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు, ఆయనను వెంబడించేవారు చాలామంది అక్కడ ఉన్నారు. పరిసయ్యులైన ధర్మశాస్త్ర ఉపదేశకులు అతన్ని పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి తినడం చూసి, “ఆయన పన్ను వసూలు చేసేవారితో పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు. అది విని, యేసు వారితో, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, కానీ పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు.

షేర్ చేయి
Read మార్కు 2

మార్కు 2:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు. నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు. యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, “అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?” వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక? ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా? భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు. వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు. యేసు మళ్లీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు. ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు. యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు. అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, “ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?” అన్నారు. యేసు ఈ మాట విని వారితో, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుని అవసరం లేదు. రోగులకే వైద్యుడు అవసరం. నేను నీతిపరులను పిలవడానికి రాలేదు, పాపాత్ములను పిలవడానికే వచ్చాను” అని అన్నాడు.

షేర్ చేయి
Read మార్కు 2

మార్కు 2:1-17 పవిత్ర బైబిల్ (TERV)

కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు. అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు. వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు. వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు. యేసు మళ్ళీ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన వాళ్ళకు బోధించటం మొదలుపెట్టాడు. అక్కడి నుండి బయలుదేరి ముందుకు నడుస్తూండగా అల్ఫయి కుమారుడైన లేవి పన్నులు వసూలు చేసే పాకలో కూర్చుని వుండటం చూసాడు. యేసు అతనితో, “నా వెంటరా” అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని అనుసరించాడు. యేసు, ఆయన శిష్యులు లేవి యింట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది యేసు అనుచరులు. పరిసయ్యులలోని శాస్త్రులు యేసు పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో భోజనం చెయ్యటం చూసారు. వాళ్ళు ఆయన శిష్యులతో, “ఆయన పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఎందుకు కలసి తింటాడు?” అని అడిగారు. ఇది విని యేసు వాళ్ళతో, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.

షేర్ చేయి
Read మార్కు 2

మార్కు 2:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి–కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారు–ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని – మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువుగలవానితో – నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి పక్ష వాయువు గలవానిని చూచి–నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను. అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబ డించువారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి–ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనముచేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

షేర్ చేయి
Read మార్కు 2