మార్కు 2:1-17

మార్కు 2:1-17 TELUBSI

కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి–కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. వారు–ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని – మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువుగలవానితో – నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి పక్ష వాయువు గలవానిని చూచి–నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను. అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబ డించువారైరి. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి–ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనముచేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

మార్కు 2:1-17 కోసం వీడియో