మార్కు 2:1-17

మార్కు 2:1-17 TCV

కొన్ని రోజుల తర్వాత, యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఆయన ఇంటికి వచ్చారని ప్రజలకు తెలిసింది. వారు పెద్ద సంఖ్యలో కూడి వచ్చారు కనుక తలుపు బయట నిలబడడానికి కూడ స్థలం లేదు, అయినా ఆయన వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు, నలుగురు అతన్ని మోసుకొచ్చారు. కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వాన్ని యేసు దగ్గరకు తీసుకొని వెళ్లలేక, సరిగ్గా యేసు ఉన్న చోట ఇంటి పైకప్పును విప్పి పక్షవాతంగల వాన్ని చాపపై పడుకోబెట్టి కిందికి దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, పక్షవాతం గలవానితో, “కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు. కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చొని ఉన్నారు, వారు తమలో తాము, “ఈ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇతడు దైవదూషణ చేస్తున్నాడు! దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచిస్తున్నారు. వారు తమ హృదయాల్లో ఆలోచిస్తున్నది ఇదే అని వెంటనే యేసు తన ఆత్మలో గ్రహించి వారితో, “మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభం: ఈ పక్షవాతం గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడమా లేక, ‘నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు’ అని చెప్పడమా? అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్నా. నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. అతడు లేచి, తన పరుపెత్తుకొని అందరూ చూస్తుండగానే నడిచి వెళ్లాడు. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడి, “ఇలాంటివి ఇంతకు ముందు మేము ఎప్పుడు చూడలేదు!” అని చెప్తూ దేవుని స్తుతించారు. యేసు మరొకసారి సరస్సు తీరానికి వెళ్లారు. అక్కడ ఒక గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వచ్చింది, ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన మార్గంలో నడుస్తుండగా, పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవిని చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు, లేవి లేచి ఆయనను వెంబడించాడు. లేవి ఇంట్లో యేసు భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు, ఆయనను వెంబడించేవారు చాలామంది అక్కడ ఉన్నారు. పరిసయ్యులైన ధర్మశాస్త్ర ఉపదేశకులు అతన్ని పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి తినడం చూసి, “ఆయన పన్ను వసూలు చేసేవారితో పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు. అది విని, యేసు వారితో, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, కానీ పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు.