మార్కు 16:1-11

మార్కు 16:1-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

సబ్బాతు దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి యేసు శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలను కొన్నారు. సబ్బాతు దినం గడిచిన తర్వాత ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారు సమాధి దగ్గరకు వెళ్తూ “సమాధి ద్వారాన్ని మూసివుంచిన రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. కాని వారు అక్కడ చేరుకుని, ఆ పెద్ద రాయి ప్రక్కకు తొలగిపోయి ఉండడం చూసారు వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, తెల్లని అంగీ వేసుకొని ఉన్న ఒక యవ్వనస్థుడు కుడి ప్రక్కన కూర్చొని ఉండడం చూసి, చాలా భయపడ్డారు. అప్పుడు ఆ దూత, “భయపడవద్దు, మీరు సిలువవేయబడిన, నజరేయుడైన యేసును వెదుకుతున్నారు. ఆయన లేచారు! ఆయన ఇక్కడ లేరు. వారు ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. అయితే వెళ్లి, ఆయన శిష్యులతో, పేతురుతో, ‘ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. ఆయన మీతో చెప్పినట్లే, అక్కడ మీరు ఆయనను చూస్తారు’ ” అని చెప్పండని ఆ స్త్రీలతో చెప్పాడు. ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ సమాధి నుండి పరుగెత్తి వెళ్లిపోయారు. వారు చాలా భయపడ్డారు, కనుక వారు ఎవరితో ఏమి చెప్పలేదు. వారంలో మొదటి రోజైన ఆదివారం తెల్లవారుతుండగా, యేసు ఎవరిలో నుండి ఏడు దయ్యాలను వెళ్లగొట్టారో ఆ మగ్దలేనె మరియకు మొదట కనిపించారు. ఆమె వెళ్లి, ఆయనతోపాటు ఉండినవారై ఆయన కొరకు దుఃఖిస్తూ, ఏడుస్తున్నవారికి చెప్పింది. యేసు బ్రతికి ఉన్నాడని, ఆమె ఆయనను చూసిందని వారు విన్నప్పుడు, వారు నమ్మలేదు.

షేర్ చేయి
Read మార్కు 16

మార్కు 16:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ, “మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది. వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు. అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.” ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు. వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు. ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది. యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు.

షేర్ చేయి
Read మార్కు 16

మార్కు 16:1-11 పవిత్ర బైబిల్ (TERV)

విశ్రాంతి రోజు ముగియగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ మరియు సలోమే యేసు దేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళాలని బయలుదేరారు. “ఇంతకూ సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తీస్తారు?” అని పరస్పరం దారిలో మాట్లాడుకొన్నారు. వాళ్ళు కళ్ళెత్తి సమాధి వైపు చూసారు. ఆ పెద్దరాయి దొర్లిపోయి ఉంది. వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు భయం వేసింది. ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన యిక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపొయ్యాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. కాని మీరు వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి: ‘యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’” ఆ స్త్రీలు దిగ్భ్రాంతి చెంది వణుకుతూ ఆ సమాధినుండి పరుగెత్తి పోయారు. భయంవల్ల వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పలేదు. యేసు ఆదివారం తెల్లవారుఝామున బ్రతికి వచ్చి మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. గతంలో యేసు ఈమె నుండి ఏడు దయ్యాలను వదిలించి ఉన్నాడు. ఆమె ఇదివరలో యేసుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్లకు జరిగిన సంగతి చెప్పింది. యేసు బ్రతికి ఉన్నాడని, తాను ఆయన్ని చూసానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు ఆమె మాటలు నమ్మలేదు.

షేర్ చేయి
Read మార్కు 16

మార్కు 16:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములుకొనిరి. వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా, –సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందు కతడు కలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను. వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని, ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి.

షేర్ చేయి
Read మార్కు 16