విశ్రాంతి రోజు ముగియగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ మరియు సలోమే యేసు దేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళాలని బయలుదేరారు. “ఇంతకూ సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తీస్తారు?” అని పరస్పరం దారిలో మాట్లాడుకొన్నారు. వాళ్ళు కళ్ళెత్తి సమాధి వైపు చూసారు. ఆ పెద్దరాయి దొర్లిపోయి ఉంది. వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు భయం వేసింది. ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన యిక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపొయ్యాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. కాని మీరు వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి: ‘యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’” ఆ స్త్రీలు దిగ్భ్రాంతి చెంది వణుకుతూ ఆ సమాధినుండి పరుగెత్తి పోయారు. భయంవల్ల వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పలేదు. యేసు ఆదివారం తెల్లవారుఝామున బ్రతికి వచ్చి మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. గతంలో యేసు ఈమె నుండి ఏడు దయ్యాలను వదిలించి ఉన్నాడు. ఆమె ఇదివరలో యేసుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్లకు జరిగిన సంగతి చెప్పింది. యేసు బ్రతికి ఉన్నాడని, తాను ఆయన్ని చూసానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు ఆమె మాటలు నమ్మలేదు.
Read మార్కు 16
వినండి మార్కు 16
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 16:1-11
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు