మార్కు 16
16
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-10)
1విశ్రాంతి రోజు#16:1 విశ్రాంతి రోజు అంటే సబ్బాతు. ముగియగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ మరియు సలోమే యేసు దేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళాలని బయలుదేరారు. 3“ఇంతకూ సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తీస్తారు?” అని పరస్పరం దారిలో మాట్లాడుకొన్నారు.
4వాళ్ళు కళ్ళెత్తి సమాధి వైపు చూసారు. ఆ పెద్దరాయి దొర్లిపోయి ఉంది. 5వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు భయం వేసింది.
6ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన యిక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపొయ్యాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. 7కాని మీరు వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి: ‘యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’”
8ఆ స్త్రీలు దిగ్భ్రాంతి చెంది వణుకుతూ ఆ సమాధినుండి పరుగెత్తి పోయారు. భయంవల్ల వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పలేదు.#16:8 ముఖ్యమైన ప్రాచీన వ్రాతప్రతులు మార్కు 16:8 తోసమాప్తమయ్యాయి.
యేసు కనిపించటం
(మత్తయి 28:9-10; యోహాను 20:11-18; లూకా 24:13-35)
9యేసు ఆదివారం తెల్లవారుఝామున బ్రతికి వచ్చి మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. గతంలో యేసు ఈమె నుండి ఏడు దయ్యాలను వదిలించి ఉన్నాడు. 10ఆమె ఇదివరలో యేసుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్లకు జరిగిన సంగతి చెప్పింది. 11యేసు బ్రతికి ఉన్నాడని, తాను ఆయన్ని చూసానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు ఆమె మాటలు నమ్మలేదు.
12ఆ తర్వాత యేసు తన యిద్దరు శిష్యులు వారి గ్రామానికి నడుస్తుండగా మరో రూపంలో కనిపించాడు. 13వీళ్ళు తిరిగి వచ్చి జరిగిన విషయం మిగిలిన శిష్యులకు చెప్పారు. కాని వాళ్ళు వీళ్ళను కూడా నమ్మలేదు.
యేసు తన శిష్యులతో మాట్లాడటం
(మత్తయి 28:16-20; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
14ఆ తర్వాత పదకొండుగురు భోజనం చేస్తుండగా యేసు వాళ్ళకు కనిపించాడు. తాను బ్రతికి వచ్చిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు. కనుక యేసు వాళ్ళు తనను నమ్మనందుకు వాళ్ళను గద్దించాడు.
15యేసు వాళ్ళతో, “ప్రపంచమంతా పర్యటన చేసి ప్రజలందరికి సువార్త ప్రకటించండి. 16విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. 17విశ్వసించిన వాళ్లకు ఈ ఋజువులు కనిపిస్తాయి. నాపేరిట వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టకలుగుతారు. తమకు రాని భాషల్లో మాట్లాడకలుగుతారు. 18తమ చేతుల్తో పాముల్ని పట్టుకోగలుగుతారు. విషం త్రాగినా వాళ్ళకే హానీ కలుగదు. వాళ్ళు తమ చేతుల్ని రోగులపై ఉంచితే వాళ్ళకు నయమైపోతుంది” అని అన్నాడు.
యేసు పరలోకానికి వెళ్ళటం
(లూకా 24:50-53; అపొ. కా. 1:9-11)
19యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడిన తరువాత దేవుడాయన్ని పరలోకానికి పిలుచుకొన్నాడు. ఆయన అక్కడ దేవుని కుడిచేతి వైపున కూర్చున్నాడు.
20ఆ తర్వాత వాళ్ళు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించారు. ప్రభువు వాళ్ళతో సహా పని చేసి వాళ్ళు ప్రకటించిన సందేశం నిజమని నిరూపించటానికి ఎన్నో అద్భుతాలు చేసి చూపాడు. ఆమేన్.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
మార్కు 16: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International