మార్కు 14:43-65
మార్కు 14:43-65 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది. ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు: “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించి బందోబస్తుతో తీసుకెళ్లండి.” యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. వారు వచ్చి యేసును పట్టుకొని, ఆయనను బంధించారు. యేసు ప్రక్కన నిలుచున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి చెవిని నరికివేశాడు. యేసు, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, మీతోనే ఉన్నాను, మీరు నన్ను బంధించలేదు. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలని ఇలా జరిగింది” అని చెప్పారు. అప్పుడు అందరు ఆయనను ఒంటరిగా విడిచి పారిపోయారు. సన్నని నార వస్త్రం మాత్రమే ధరించిన ఒక యువకుడు, యేసును వెంబడిస్తున్నాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు, అతడు ఆ వస్త్రాన్ని వదిలి దిగంబరిగా పారిపోయాడు. వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకెళ్లారు, ముఖ్య యాజకులు, నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరు అక్కడ సమావేశం అయ్యారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. అక్కడ కాపలా కాస్తున్న వారితో చలిమంట దగ్గర కూర్చుని, చలి కాచుకుంటున్నాడు. ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వెదకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకలేదు. ఆయనకు వ్యతిరేకంగా అనేకులు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు, కాని వాటిలో ఒకదానికొకటి సరిపోలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా ఈ అబద్ధసాక్ష్యం చెప్పారు: “ ‘ఇతడు మనుష్యుల చేతులతో కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో మనుష్యుల చేతులతో కట్టని మరొక దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి యేసును, “నీవు వారికి సమాధానం ఇవ్వవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న సాక్ష్యాల గురించి నీవు ఏమంటావు?” అని అడిగాడు. కాని యేసు మౌనంగా ఉండి వారికి ఏ జవాబు ఇవ్వలేదు. ప్రధాన యాజకుడు మళ్ళీ యేసును, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా?” అని అడిగాడు. అందుకు యేసు, “అవును” అంతేకాదు, “మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు” అని చెప్పారు. అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, “ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు. ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయడం మొదలుపెట్టారు; వారు ఆయన కళ్లు మూసి, ఆయనను తమ పిడికిళ్ళతో గుద్ది, “నిన్ను ఎవరు కొట్టారో, చెప్పు!” అన్నారు. కావలివారు కూడా ఆయనను పట్టుకుని కొట్టారు.
మార్కు 14:43-65 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి. ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, “నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి” అన్నాడు. అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు. అక్కడ నిలుచున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి అతని చెవి నరికి వేశాడు. యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా? నేను ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా! అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది.” అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు. కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు. వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు. పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు. ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు. చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కాని, వారి సాక్షాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ, “ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు. కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు. అప్పుడు యేసు, “నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం, పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు. ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని? ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు. అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, “ఎవరో ప్రవచించు” అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు.
మార్కు 14:43-65 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు. ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు. వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు. వచ్చిన ప్రజలు యేసును బంధించారు. యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు. యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా? నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు. అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు. ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని, అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు. వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరిస్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకొంటూ వాళ్ళతో కూర్చున్నాడు. ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని వాళ్ళకు సాక్ష్యం లభించలేదు. చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు: “‘మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను’ అని అతడు అనటం మేము విన్నాము.” కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు. ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా! నీవేమంటావు?” అని అడిగాడు. కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” అని మళ్ళీ ప్రశ్నించాడు. యేసు, “ఔను, సర్వశక్తిసంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు. ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని “మనకు యితర సాక్ష్యాలు ఎందుకు? అతడు దైవదూషణ చేయటం మీరు విన్నారుగదా; మీ అభిప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు. అందరూ మరణదండన విధించాలని అన్నారు. ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది, “ఎవరో చెప్పుకో” అని హేళన చేసారు. కాపలాకాచే భటులు ఆయన్ని తీసుకువెళ్ళి కొట్టారు.
మార్కు 14:43-65 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి. ఆయనను అప్పగించువాడు – నేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి–బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా వారు ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. అందుకు యేసు–మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను). అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొనిపోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను. ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు. అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడుదినములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధానయాజకుడు వారిమధ్యను లేచి నిలిచి–ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు–పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా యేసు–అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధానయాజకుడు తన వస్ర్తములు చింపుకొని–మనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచు చున్నదని అడుగగా వారందరు–మరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి. కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచు – ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.
మార్కు 14:43-65 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)