మార్కు సువార్త 14:43-65

మార్కు సువార్త 14:43-65 TSA

ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది. ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు: “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించి బందోబస్తుతో తీసుకెళ్లండి.” యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. వారు వచ్చి యేసును పట్టుకొని, ఆయనను బంధించారు. యేసు ప్రక్కన నిలుచున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి చెవిని నరికివేశాడు. యేసు, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో బోధిస్తూ, మీతోనే ఉన్నాను, మీరు నన్ను బంధించలేదు. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలని ఇలా జరిగింది” అని చెప్పారు. అప్పుడు అందరు ఆయనను ఒంటరిగా విడిచి పారిపోయారు. సన్నని నార వస్త్రం మాత్రమే ధరించిన ఒక యువకుడు, యేసును వెంబడిస్తున్నాడు. వారు అతన్ని పట్టుకున్నప్పుడు, అతడు ఆ వస్త్రాన్ని వదిలి దిగంబరిగా పారిపోయాడు. వారు యేసును ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకెళ్లారు, ముఖ్య యాజకులు, నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరు అక్కడ సమావేశం అయ్యారు. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ప్రాంగణం వరకు, ఆయనను దూరం నుండి వెంబడిస్తూ వచ్చాడు. అక్కడ కాపలా కాస్తున్న వారితో చలిమంట దగ్గర కూర్చుని, చలి కాచుకుంటున్నాడు. ముఖ్య యాజకులు న్యాయసభ సభ్యులందరు యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలను వెదకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకలేదు. ఆయనకు వ్యతిరేకంగా అనేకులు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు, కాని వాటిలో ఒకదానికొకటి సరిపోలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా ఈ అబద్ధసాక్ష్యం చెప్పారు: “ ‘ఇతడు మనుష్యుల చేతులతో కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో మనుష్యుల చేతులతో కట్టని మరొక దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు వారి ముందు నిలబడి యేసును, “నీవు వారికి సమాధానం ఇవ్వవా? నీకు వ్యతిరేకంగా వీరు చెప్తున్న సాక్ష్యాల గురించి నీవు ఏమంటావు?” అని అడిగాడు. కాని యేసు మౌనంగా ఉండి వారికి ఏ జవాబు ఇవ్వలేదు. ప్రధాన యాజకుడు మళ్ళీ యేసును, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా?” అని అడిగాడు. అందుకు యేసు, “అవును” అంతేకాదు, “మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు” అని చెప్పారు. అప్పుడు ప్రధాన యాజకుడు తన బట్టలను చింపుకొని, “ఇంకా మనకు సాక్షులు ఏం అవసరం? ఇప్పుడే దైవదూషణ మీరు విన్నారు. మీకు ఏమి అనిపిస్తుంది?” అని అడిగాడు. అందుకు వారందరు మరణశిక్ష విధించాలి అన్నారు. ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయడం మొదలుపెట్టారు; వారు ఆయన కళ్లు మూసి, ఆయనను తమ పిడికిళ్ళతో గుద్ది, “నిన్ను ఎవరు కొట్టారో, చెప్పు!” అన్నారు. కావలివారు కూడా ఆయనను పట్టుకుని కొట్టారు.