మార్కు 11:12-25

మార్కు 11:12-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మరుసటిరోజు వారు బేతనియ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు, యేసుకు ఆకలివేసింది. దూరం నుండి ఒక అంజూరపు చెట్టును చూసి, దానిలో ఏమైనా పండ్లు ఉన్నాయా అని దగ్గరకు వెళ్లారు. కాని అది అంజూరపు పండ్లు కాసే కాలం కాదు కనుక ఆకులు తప్ప పండ్లేమి కనిపించలేదు. అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఇక నుండి ఎవ్వరు ఎన్నడు నీ పండ్లను తినకపోవుదురు గాక” అన్నారు. ఆయన అలా అనడం శిష్యులు విన్నారు. వారు యెరూషలేము చేరిన తర్వాత, యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్న వారినందరిని తరమడం ప్రారంభించారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేసారు. దేవాలయ ఆవరణంలో ఎవరినీ వ్యాపారం చేయనివ్వలేదు. ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని జనాంగాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా? కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ మాటలు విని, ఆయనను చంపడానికి ఒక మార్గాన్ని వెదకడం ప్రారంభించారు, కాని ప్రజలందరు ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడటం చూసి, ఆయనకు భయపడ్డారు. సాయంత్రంమైనప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు. మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూరపుచెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకొని యేసుతో, “బోధకుడా చూడు! నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయింది” అన్నాడు. అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. “ఎవరైనా ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పి, తమ మనస్సులో సందేహించక తాము చెప్పింది తప్పక జరుగుతుందని నమ్మితే, వారికి అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు. మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైన వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు. [

షేర్ చేయి
Read మార్కు 11

మార్కు 11:12-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు. వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి, వ్యాపారం చేస్తున్నవారిని తరిమి వేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు. దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోకుండా చేశాడు. ఆయన వారికి బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’ అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు గానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు. సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు. తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు. అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అన్నాడు. అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి.

షేర్ చేయి
Read మార్కు 11

మార్కు 11:12-25 పవిత్ర బైబిల్ (TERV)

మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు. యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు. దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు. ఆయన బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు. కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు” అని అన్నాడు. అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపొయ్యారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలు పెట్టారు. సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు. ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”

షేర్ చేయి
Read మార్కు 11

మార్కు 11:12-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. అందుకాయన–ఇకమీదట ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ; ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. మరియు ఆయన బోధించుచు –నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను. ప్రొద్దునవారు మార్గమున పోవుచుండగా ఆ అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని–బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను–మీరు దేవునియందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి–నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్నయెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.

షేర్ చేయి
Read మార్కు 11

మార్కు 11:12-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

మరుసటిరోజు వారు బేతనియ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు, యేసుకు ఆకలివేసింది. దూరం నుండి ఒక అంజూర చెట్టును చూసి, దానిలో ఏమైనా పండ్లు ఉన్నాయా అని దగ్గరకు వెళ్లారు. కాని అది అంజూర పండ్లు కాసే కాలం కాదు కాబట్టి ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఇకపై ఎవ్వరూ ఎన్నడు నీ పండ్లను తినకపోవుదురు గాక” అన్నారు. ఆయన అలా అనడం శిష్యులు విన్నారు. వారు యెరూషలేము చేరిన తర్వాత, యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరమడం ప్రారంభించారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు. దేవాలయ ఆవరణంలో ఎవరినీ వ్యాపారం చేయనివ్వలేదు. ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా? కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ మాటలు విని, ఆయనను చంపడానికి ఒక మార్గాన్ని వెదకడం ప్రారంభించారు, కాని ప్రజలందరు ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడడం చూసి, ఆయనకు భయపడ్డారు. సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు. మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూర చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకుని యేసుతో, “బోధకుడా చూడు! నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది” అన్నాడు. అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. “ఎవరైనా ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పి, తమ మనస్సులో సందేహించక తాము చెప్పింది తప్పక జరుగుతుందని నమ్మితే, వారికి అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు. మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైనా వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు.

షేర్ చేయి
Read మార్కు 11