మార్కు సువార్త 11:12-25

మార్కు సువార్త 11:12-25 TSA

మరుసటిరోజు వారు బేతనియ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు, యేసుకు ఆకలివేసింది. దూరం నుండి ఒక అంజూర చెట్టును చూసి, దానిలో ఏమైనా పండ్లు ఉన్నాయా అని దగ్గరకు వెళ్లారు. కాని అది అంజూర పండ్లు కాసే కాలం కాదు కాబట్టి ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఇకపై ఎవ్వరూ ఎన్నడు నీ పండ్లను తినకపోవుదురు గాక” అన్నారు. ఆయన అలా అనడం శిష్యులు విన్నారు. వారు యెరూషలేము చేరిన తర్వాత, యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరమడం ప్రారంభించారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు. దేవాలయ ఆవరణంలో ఎవరినీ వ్యాపారం చేయనివ్వలేదు. ఆయన వారికి బోధిస్తూ, “ ‘నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడలేదా? కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు’ ” అన్నారు. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ మాటలు విని, ఆయనను చంపడానికి ఒక మార్గాన్ని వెదకడం ప్రారంభించారు, కాని ప్రజలందరు ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడడం చూసి, ఆయనకు భయపడ్డారు. సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు. మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూర చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకుని యేసుతో, “బోధకుడా చూడు! నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది” అన్నాడు. అందుకు యేసు, “దేవునిలో విశ్వాసముంచండి” అని చెప్పారు. “ఎవరైనా ఈ కొండతో, ‘వెళ్లు, సముద్రంలో పడు’ అని చెప్పి, తమ మనస్సులో సందేహించక తాము చెప్పింది తప్పక జరుగుతుందని నమ్మితే, వారికి అది జరుగుతుందని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినా, దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు దానిని మీరు పొందుకుంటారు. మీరు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఎవరిపట్లనైనా ఏదైనా వ్యతిరేకత కలిగి ఉంటే, వారిని క్షమించండి, దాన్ని బట్టి మీ పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమిస్తారు.

మార్కు సువార్త 11:12-25 కోసం వీడియో