మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు. యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు. దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు. ఆయన బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు. కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు” అని అన్నాడు. అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపొయ్యారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలు పెట్టారు. సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు. ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”
Read మార్కు 11
వినండి మార్కు 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మార్కు 11:12-25
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు