మత్తయి 10:24-42

మత్తయి 10:24-42 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఒక శిష్యుడు బోధకుని కంటే లేక సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటి వారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా! “కనుక వారికి భయపడకండి, ఎందుకంటే దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. నేను మీతో చీకట్లో చెప్పేదానిని మీరు పగటివేళలో చెప్పండి; మీ చెవిలో చెప్పబడినదానిని పైకప్పులమీద నుండి ప్రకటించండి. శరీరాన్ని చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి. రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు; కనుక భయపడకండి. “ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. కాని ఇతరుల ముందు ఎవరు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను. “భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని తలంచకండి. సమాధానం కాదు, నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చాను. ఎలాగంటే, “ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారున్ని, తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తెను, తన అత్తకు వ్యతిరేకంగా కోడలును మార్చడానికి వచ్చాను. ఒక మనుష్యునికి అతని సొంత ఇంటివారే శత్రువులవుతారు.’ “తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు. తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకొంటారు. నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు. “మిమ్మల్ని చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకొంటారు. ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతులు అని, నీతిమంతులను చేర్చుకొనేవారు, నీతిమంతుల ఫలం పొందుతారు. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చల్లని నీళ్ళను ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”

షేర్ చేయి
Read మత్తయి 10

మత్తయి 10:24-42 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు. శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారు గదా! కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు. మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి. “ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి. రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు. మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు. కాబట్టి భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటే ఎంతో విలువైన వారు. మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను. ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను. “నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గానీ శాంతిని కాదు. అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. ఒక వ్యక్తి స్వంత ఇంటివాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు. నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు. తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు. మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు. ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు. శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.”

షేర్ చేయి
Read మత్తయి 10

మత్తయి 10:24-42 పవిత్ర బైబిల్ (TERV)

“విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా! “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి. “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు. “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను. కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను. “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. ఎందుకంటే నేను, ‘తండ్రి కుమార్ల మధ్య, తల్లీ కూతుర్ల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య, విరోధం కలిగించాలని వచ్చాను. ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’ “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు. జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు. “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”

షేర్ చేయి
Read మత్తయి 10

మత్తయి 10:24-42 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టియుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును. నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

షేర్ చేయి
Read మత్తయి 10