మత్తయి 10

10
1ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను.
2ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; 3ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; 4కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.
5యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింప కుడి గాని 6ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి. 7వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి. 8రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. 9మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి; 10పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? 11మరియు మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి. 12ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి. 13ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. 14ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండినయెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. 15విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
16ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. 17మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు, 18వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు. 19వారు మిమ్మును అప్పగించునప్పుడు, – ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. 20మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. 21సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. 22మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించినవాడు రక్షింపబడును. 23వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
24శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. 25శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టియుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. 26కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. 27చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి. 28మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 29రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. 30-31మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. 32మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును. 33మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.
34నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. 35ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. 36ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. 37తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు; 38తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. 39తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.
40మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. 41ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. 42మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మత్తయి 10: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in