మత్తయి 10:24-42

మత్తయి 10:24-42 TCV

ఒక శిష్యుడు బోధకుని కంటే లేక సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. శిష్యుడు తన బోధకునిలా, సేవకుడు తన యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు అని పిలిస్తే అతని ఇంటి వారిని ఇంకా ఎలా పిలుస్తారో గదా! “కనుక వారికి భయపడకండి, ఎందుకంటే దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు. నేను మీతో చీకట్లో చెప్పేదానిని మీరు పగటివేళలో చెప్పండి; మీ చెవిలో చెప్పబడినదానిని పైకప్పులమీద నుండి ప్రకటించండి. శరీరాన్ని చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి. రెండు పిచ్చుకలు ఒక్క కాసుకు అమ్మబడడం లేదా! అయినా వాటిలో ఒకటి కూడా మీ పరమతండ్రి అనుమతి లేకుండా నేల కూలదు. అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు; కనుక భయపడకండి. “ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. కాని ఇతరుల ముందు ఎవరు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను. “భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని తలంచకండి. సమాధానం కాదు, నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చాను. ఎలాగంటే, “ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారున్ని, తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తెను, తన అత్తకు వ్యతిరేకంగా కోడలును మార్చడానికి వచ్చాను. ఒక మనుష్యునికి అతని సొంత ఇంటివారే శత్రువులవుతారు.’ “తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు. తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకొంటారు. నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు. “మిమ్మల్ని చేర్చుకొనేవారు నన్ను చేర్చుకొంటారు. నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకొంటారు. ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతులు అని, నీతిమంతులను చేర్చుకొనేవారు, నీతిమంతుల ఫలం పొందుతారు. నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకరికి ఒక గిన్నెడు చల్లని నీళ్ళను ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.”