లూకా 7:17-23

లూకా 7:17-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయననుగూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపెట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి. అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి–రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి –రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయ చేసెను. అప్పుడాయన–మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది; నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను.

షేర్ చేయి
Read లూకా 7

లూకా 7:17-23 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఆయన గురించి ఈ సమాచారం యూదయ మరియు చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది. యోహాను శిష్యులు ఈ సంగతులన్నిటిని యోహానుకు తెలియజేసారు. అయితే యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, వారిని ప్రభువు దగ్గరకు పంపించి, “రావలసిన వాడవు నీవేనా లేక మేము వేరొకరి కొరకు చూడాలా?” అని అడగమన్నాడు. ఆ మనుష్యులు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మల్ని నీ దగ్గరకు పంపి, ‘రావలసిన వాడవు నీవేనా? లేక మేము మరొకరి కొరకు ఎదురు చూడాలా?’ అని అడగమన్నాడు” అని చెప్పారు. ఆ సమయంలోనే యేసు అనేకమంది రోగులను, అనారోగ్యం గలవారిని, దయ్యాలు పట్టినవారిని స్వస్థపరచి, అనేకమంది గ్రుడ్డివారికి చూపునిచ్చారు. కనుక యేసు వారితో, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి; గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది. నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు.

షేర్ చేయి
Read లూకా 7

లూకా 7:17-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది. యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియజేశారు. అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, “రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరికి పంపించాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, “‘రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా?’ అని అడగమని మమ్మల్ని బాప్తిసమిచ్చే యోహాను నీ దగ్గరికి పంపాడు” అని చెప్పారు. అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు. అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, “వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. నా విషయంలో అభ్యంతరాలేమీ లేని వాడు ధన్యుడు.”

షేర్ చేయి
Read లూకా 7

లూకా 7:17-23 పవిత్ర బైబిల్ (TERV)

యేసును గురించి యూదయ ప్రాంతంలోను, దాని చుట్టూవున్న ప్రాంతాల్లోను తెలిసిపోయింది. యోహాను శిష్యులు యోహానుకు వీటన్నిటిని గురించి చెప్పారు. అతడు తన శిష్యుల్లో యిద్దర్ని పిలిచి, “రానున్నది మీరేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని ప్రభువును అడిగిరమ్మని పంపాడు. వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మము నిచ్చి, ఉపదేశం చేసే యోహాను ఈ విధంగా అడిగి రమ్మని మమ్మల్ని పంపాడు: ‘రానున్నది మీరేనా? మరొకరి కోసం మేము ఎదురుచూడాలా?’” అని అన్నారు. వాళ్ళు అక్కడ ఉండగా యేసు రోగగ్రస్తులకు, బాధితులకు, దయ్యాలు పట్టిన వాళ్లకు నయం చేశాడు. చాలా మంది గ్రుడ్డి వాళ్ళకు దృష్టినిచ్చాడు. యేసు, ఆ వర్తమానం తెచ్చిన వాళ్ళతో, “వెళ్ళి యోహానుతో గ్రుడ్డివాళ్ళకు దృష్టి లభిస్తొందని, కుంటివాళ్ళు నడుస్తున్నారని, కుష్టురోగులకు నయమౌతుందని, చెవిటి వాళ్ళు వింటున్నారని, పేదవాళ్ళకు దైవ సందేశము బోధింపబడ్తోందని చెప్పండి. మీరు చూసిన వాటిని, విన్నవాటిని అతనికి చెప్పండి. నన్ను విశ్వసించటానికి వెనుకంజ వెయ్యని వాడు ధన్యుడు” అని అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 7