లూకా 7
7
1ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా విని పించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. 2ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను. 3శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. 4వారు యేసునొద్దకు వచ్చి–నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; 5అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. 6కావున యేసు వారితోకూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి–మీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. 7అందుచేత నీయొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు; అయితే మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, 8నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. 9యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహమువైపు తిరిగి–ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను. 10పంపబడినవారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి.
11వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహుజనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. 12ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతోకూడ ఉండిరి. 13ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి–ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. 14ఆయన –చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా 15ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. 16అందరు భయాక్రాంతులై–మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి. 17ఆయననుగూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపెట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను.
18యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి. 19అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి–రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. 20ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి –రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి. 21ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయ చేసెను. 22అప్పుడాయన–మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది; 23నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను.
24యోహాను దూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను–మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? 25మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. 26అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పు చున్నాను.
27–ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు
చున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును
అని యెవరినిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను. 28స్ర్తీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పు చున్నాను. 29ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని 30పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. 31కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చు దును, వారు దేనిని పోలియున్నారు? 32సంతవీధులలో కూర్చుండియుండి–మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. 33బాప్తిస్మ మిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక–వీడు దయ్యముపెట్టినవాడని మీ రనుచున్నారు. 34మనుష్యకుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరు–ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితు డును అనుచున్నారు. 35అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి#7:35 మూలభాషలో–పిల్లలందరినిబట్టి. తీర్పుపొందుననెను.
36పరిసయ్యులలో ఒకడు తనతోకూడ భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా 37ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్ర్తీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి 38వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదము లను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. 39ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి–ఈయన ప్రవక్తయైనయెడల#7:39 కొన్ని ప్రాచీన ప్రతులలో–ఆ ప్రవక్తయైనయెడల, అని పాఠాంతరము. తన్ను ముట్టుకొనిన యీ స్ర్తీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. 40అందుకు యేసు– సీమోనూ, నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడుబోధకుడా, చెప్పుమనెను. 41అప్పుడు యేసు–అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును#7:41 ఒక దేనారము ఇంచుమించు అర్ధరూపాయి కావచ్చును. మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. 42ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. 43అందుకు సీమోను–అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన–నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి 44ఆ స్ర్తీవైపు తిరిగి, సీమోనుతో ఇట్లనెను–ఈ స్ర్తీని చూచుచున్నావే, నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. 45నీవు నన్ను ముద్దుపెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మానలేదు. 46నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. 47ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి 48–నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను. 49అప్పుడాయనతోకూడ భోజన పంక్తిని కూర్చుండినవారు–పాపములు క్షమించుచున్న యితడెవ డని తమలోతాము అనుకొనసాగిరి. 50అందుకాయన– నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్ర్తీతో చెప్పెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
లూకా 7: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.