లూకా 7:17-23

లూకా 7:17-23 IRVTEL

ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది. యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియజేశారు. అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, “రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరికి పంపించాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, “‘రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా?’ అని అడగమని మమ్మల్ని బాప్తిసమిచ్చే యోహాను నీ దగ్గరికి పంపాడు” అని చెప్పారు. అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు. అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, “వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. నా విషయంలో అభ్యంతరాలేమీ లేని వాడు ధన్యుడు.”