లూకా 5:11-32

లూకా 5:11-32 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన యొక పట్టణములోనున్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి, సాగిలపడి–ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడాయన చెయ్యిచాపి వానిని ముట్టి–నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడాయన–నీవు ఎవనితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. అయితే ఆయననుగూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్లుచుండెను. ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని, వానిని లోపలికి తెచ్చి, ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపుకూడి యుండి నందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక, ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి, మంచముతోకూడ యేసు ఎదుట వారిమధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి–మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా, శాస్త్రులును పరిసయ్యులును–దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచన లెరిగి–మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? –నీ పాపములు క్షమింపబడి యున్నవని చెప్పుట సులభమా? –నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి–నీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను. వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను. అందరును విస్మయమొంది–నేడు గొప్ప వింతలు చూచితి మని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను. ఆ లేవి, తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితోకూడ భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి–సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి. అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 5

లూకా 5:11-32 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

వారు తమ పడవలను ఒడ్డుకు చేర్చి, అన్నిటినీ విడిచి ఆయనను వెంబడించారు. యేసు ఒక పట్టణంలో ఉన్నప్పుడు, కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు యేసును చూసి, నేల మీద సాగిలపడి “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను శుద్ధునిగా చేయి” అని ఆయనను బ్రతిమాలాడు. యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు అవు!” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచింది. అప్పుడు యేసు, “నీవు ఎవరికి చెప్పకు, కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా, నీ శుద్ధీకరణ కొరకు మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని వానిని ఆదేశించారు. అయినాసరే ఆయనను గురించిన వార్త మరి ఎక్కువగా వ్యాపించి, ఆయన చెప్పే మాటలను వినడానికి మరియు వారి వ్యాధుల నుండి స్వస్థపడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. అయితే యేసు తరచుగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి ప్రార్థించారు. ఒక రోజు యేసు బోధిస్తూ ఉండగా, పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చొని ఉన్నారు. వారు గలిలయ, యూదయ, యెరూషలేము ప్రాంతాలలోని ప్రతి గ్రామం నుండి వచ్చారు. ఆ సమయంలో రోగులను బాగుచేసే ప్రభువు శక్తి యేసులో ఉంది. కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద మోసుకొని వచ్చి, యేసు ముందు ఉంచాలని ఇంట్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వానిని తీసుకువెళ్లే మార్గం కనిపించలేదు, గనుక వారు ఆ ఇంటి కప్పుమీదికి ఎక్కి పెంకులు తీసి ప్రజల మధ్య, ఆ చాపతోనే వానిని యేసు ముందు దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “స్నేహితుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు. పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు, తమలో తాము, “దైవదూషణ చేస్తున్న వీడు ఎవడు? దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచించడం మొదలుపెట్టారు. యేసు వారి ఆలోచనలను గ్రహించి, “మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేక ‘లేచి నడువు’ అని చెప్పడమా?” అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని “నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్నా, నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. వెంటనే వాడు వారి ముందే లేచి, తాను పడుకొని ఉన్న పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. వారు భయంతో నిండుకొని, “ఈ రోజు మేము అద్బుతాలను చూసాం” అని చెప్పుకొన్నారు. దీని తర్వాత, యేసు బయటికి వెళ్తూ లేవి అనే పేరుగల పన్ను వసూలు చేసేవాడు పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉండడం చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు. వెంటనే లేవి లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు. తర్వాత, లేవి యేసు కొరకు తన ఇంట్లో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు, పెద్ద సంఖ్యలో పన్ను వసూలు చేసేవారు మరియు ఇతరులు వారితో పాటు తింటున్నారు. అయితే వారి తెగకు చెందిన పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఎందుకు మీరు పన్నులు వసూలు చేసేవారితో పాపులతో కలిసి తిని త్రాగుతారు?” అని ఆయన శిష్యులతో అన్నారు. అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులు పశ్చాత్తాపపడాలని వారిని పిలువడానికి వచ్చాను” అన్నారు.

షేర్ చేయి
Read లూకా 5

లూకా 5:11-32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు. యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, “నాకిష్టమే. బాగు పడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది. “ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు” అని యేసు అతన్ని ఆదేశించాడు. అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు. అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు. ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా? అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు. ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు. అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు. లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులూ వారి శాస్త్రులూ, “మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?” అని శిష్యుల మీద సణుక్కున్నారు. అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు. పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 5

లూకా 5:11-32 పవిత్ర బైబిల్ (TERV)

వాళ్ళు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయన్ని అనుసరించారు. యేసు ఒక గ్రామంలో ఉండగా ఒళ్ళంతా కుష్టురోగం ఉన్న వాడు ఆయన్ని చూడాలని వచ్చాడు. యేసును చూడగానే ఆయన కాళ్ల ముందు సాష్టాంగ పడి, “ప్రభూ! మీరు దయ తలిస్తే నాకు నయం చెయ్యగలరు!” అని వేడుకొన్నాడు. యేసు, “నీకు నయం చేస్తాను!” అని అంటూ తన చేయి జాపి అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతణ్ణి వదిలి పోయింది. ఆ తర్వాత యేసు, “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. కాని వెళ్ళి యాజకునికి చూపు! మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. నీకు నయమైపోయిందని నిరూపించుకో!” అని ఆజ్ఞాపించాడు. కాని యేసును గురించి యింకా చాలా మందికి తెలిసిపోయింది. ఆయన బోధనలు వినటానికి, తమరోగాలు నయం చేసుకోవటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. కాని యేసు ప్రార్థించటానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఒక రోజు ఆయన బోధిస్తుండగా పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు గలిలయలోని పల్లెల నుండి, యూదయ, యెరూషలేము పట్టణాల నుండి వచ్చిన వాళ్ళు. రోగులకు నయం చేసే శక్తి యేసులో ఉంది. కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. అతణ్ణి యేసు ముందు ఉంచాలని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. కాని ప్రజాసమూహం అధికముగా ఉండటం వల్ల అలా చెయ్యటం వీలుకాలేదు. వాళ్ళు ఇంటి మీదికి వెళ్ళి పైకప్పు ద్వారా ఆ రోగిని మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన వాళ్ళ విశ్వాసం చూసి, “మిత్రమా, నీ పాపాలు క్షమించాను!” అని అన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు మనస్సులో, “భక్తి హీనునిగా మాట్లాడుతున్నాడే? వీడెవడు? దేవుడు తప్ప యితరులెవరు పాపాలు క్షమించగలరు?” అని అనుకున్నారు. వాళ్ళేమనుకుంటున్నారో యేసుకు తెలిసి పోయింది. ఆయన, “మీరు మీ మనస్సులో అలా ఎందుకాలోచిస్తున్నారు? ‘నీ పాపాలు క్షమించాను’ అని అనటం తేలికా? లేదా ‘లేచి నడు’ అని అనటం తేలికా? కాని మనుష్యకుమారునికి ఈ భూమ్మీద పాపాలు క్షమించటానికి అధికారముందని మీరు గ్రహించాలి” అని అంటూ ఆ పక్షవాత రోగితో, “నేను చెబుతున్నాను; లేచి నీ మంచం తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు. ఆ పక్షవాత రోగి వెంటనే అందరి ముందు లేచి తానిదివరకు పడుకున్న మంచమును తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ యింటికి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా దిగ్భ్రాంతి చెంది దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. వాళ్ళు భయంతో, “ఈ రోజు మనం అనుకోని గొప్ప సంఘటన చూసాము” అని అన్నారు. తర్వాత యేసు అక్కడి నుండి వెళ్ళి పోయాడు. లేవి అనే ఒక పన్నులు సేకరించే గుమాస్తా, పన్నులు సేకరిస్తూ ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. యేసు అతణ్ణి చూసి, “నా వెంటరా!” అని అతనితో అన్నాడు. లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు. ఆ తర్వాత లేవి తన యింట్లో యేసు కోసం ఒక పెద్ద విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇతర్లు ఆయనతో కలసి భోజనం చేస్తూఉన్నారు. పరిసయ్యులు, వాళ్ళ గుంపుకు చెందిన శాస్త్రులు యేసు అనుచరులతో, “మీరు పన్నులు సేకరించే వాళ్ళతో, పాపులతో కలిసి ఎందుకు తింటారు?” అని విమర్శిస్తూ అడిగారు. యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతుల్ని పిలిచి, వాళ్ళకు మారుమనస్సు పొందుమని చెప్పటానికి రాలేదు. పాపుల కోసం వచ్చాను” అని సమాధానం చెప్పాడు.

షేర్ చేయి
Read లూకా 5