లూకా 5:11-32

లూకా 5:11-32 TCV

వారు తమ పడవలను ఒడ్డుకు చేర్చి, అన్నిటినీ విడిచి ఆయనను వెంబడించారు. యేసు ఒక పట్టణంలో ఉన్నప్పుడు, కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు యేసును చూసి, నేల మీద సాగిలపడి “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను శుద్ధునిగా చేయి” అని ఆయనను బ్రతిమాలాడు. యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు అవు!” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచింది. అప్పుడు యేసు, “నీవు ఎవరికి చెప్పకు, కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా, నీ శుద్ధీకరణ కొరకు మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని వానిని ఆదేశించారు. అయినాసరే ఆయనను గురించిన వార్త మరి ఎక్కువగా వ్యాపించి, ఆయన చెప్పే మాటలను వినడానికి మరియు వారి వ్యాధుల నుండి స్వస్థపడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. అయితే యేసు తరచుగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి ప్రార్థించారు. ఒక రోజు యేసు బోధిస్తూ ఉండగా, పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చొని ఉన్నారు. వారు గలిలయ, యూదయ, యెరూషలేము ప్రాంతాలలోని ప్రతి గ్రామం నుండి వచ్చారు. ఆ సమయంలో రోగులను బాగుచేసే ప్రభువు శక్తి యేసులో ఉంది. కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద మోసుకొని వచ్చి, యేసు ముందు ఉంచాలని ఇంట్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వానిని తీసుకువెళ్లే మార్గం కనిపించలేదు, గనుక వారు ఆ ఇంటి కప్పుమీదికి ఎక్కి పెంకులు తీసి ప్రజల మధ్య, ఆ చాపతోనే వానిని యేసు ముందు దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “స్నేహితుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు. పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు, తమలో తాము, “దైవదూషణ చేస్తున్న వీడు ఎవడు? దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచించడం మొదలుపెట్టారు. యేసు వారి ఆలోచనలను గ్రహించి, “మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేక ‘లేచి నడువు’ అని చెప్పడమా?” అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని “నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్నా, నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. వెంటనే వాడు వారి ముందే లేచి, తాను పడుకొని ఉన్న పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. వారు భయంతో నిండుకొని, “ఈ రోజు మేము అద్బుతాలను చూసాం” అని చెప్పుకొన్నారు. దీని తర్వాత, యేసు బయటికి వెళ్తూ లేవి అనే పేరుగల పన్ను వసూలు చేసేవాడు పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉండడం చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు. వెంటనే లేవి లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు. తర్వాత, లేవి యేసు కొరకు తన ఇంట్లో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు, పెద్ద సంఖ్యలో పన్ను వసూలు చేసేవారు మరియు ఇతరులు వారితో పాటు తింటున్నారు. అయితే వారి తెగకు చెందిన పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఎందుకు మీరు పన్నులు వసూలు చేసేవారితో పాపులతో కలిసి తిని త్రాగుతారు?” అని ఆయన శిష్యులతో అన్నారు. అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులు పశ్చాత్తాపపడాలని వారిని పిలువడానికి వచ్చాను” అన్నారు.