వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు. యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, “నాకిష్టమే. బాగు పడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది. “ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు” అని యేసు అతన్ని ఆదేశించాడు. అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు. అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు. ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా? అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు. ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు. అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు. లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులూ వారి శాస్త్రులూ, “మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?” అని శిష్యుల మీద సణుక్కున్నారు. అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు. పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు.
Read లూకా 5
వినండి లూకా 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 5:11-32
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు