లూకా 22:7-19

లూకా 22:7-19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, యేసు పేతురు మరియు యోహానును పిలిచి, “మీరు వెళ్లి మనం పస్కాను భుజించడానికి సిద్ధం చేయండి” అని పంపారు. కనుక వారు, “మేము ఎక్కడ ఏర్పాటు చేయాలి?” అని అడిగారు. అందుకు ఆయన, “మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకొని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, అతడు ప్రవేశించే ఇంటి వరకు అతన్ని వెంబడించి, ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి. అతడు అన్ని సదుపాయాలతో ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు. వారు అక్కడికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొని పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు. వారు పస్కా భుజించే సమయం వచ్చినపుడు, ఆయన తన అపొస్తలులతో భోజనబల్ల దగ్గర కూర్చున్నారు. ఆయన వారితో, “నేను శ్రమను అనుభవించక ముందు ఈరీతిగా మీ అందరితో కలిసి ఈ పస్కా విందును భుజించాలని ఎంతో ఆశించాను. ఎందుకంటే, ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు, మరలా దీనిని నేను భుజించను అని మీకు చెప్తున్నాను” అన్నారు. ఆయన గిన్నెను తీసుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, “ఇది తీసుకుని మీరందరు పంచుకోండి. దేవుని రాజ్యం వచ్చేవరకు మళ్ళీ ఈ ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుతున్నాను” అన్నారు. ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, “ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:7-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది. యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు. వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు. ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి. మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి. అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు. సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు. సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు. అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను. ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.” తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి. ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు. ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:7-19 పవిత్ర బైబిల్ (TERV)

పులవకుండా రొట్టెలు చేసే పండుగ వచ్చింది. ఆ రోజు పస్కా గొఱ్ఱె పిల్లను బలి ఇచ్చేవాళ్ళు. యేసు పేతురు, యోహానులతో, “వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యండి” అని చెప్పాడు. వాళ్ళు, “ఎక్కడ సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు. ఆయన, “మీరు పట్టణంలోకి ప్రవేశిస్తుంటే నీళ్ళ కడవ ఎత్తుకొని వెళ్తున్న వాడొకడు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించి అతడు ఏ యింట్లోకి వెళ్తాడో ఆ యింట్లోకి వెళ్ళండి. ఆ యింటి యజమానితో, ‘మా బోధకుడు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చెయ్యాలి. కనుక అతిథులుండే గది ఎక్కడుందో మాకు చూపండి’ అని అతనితో అనండి. అతడు మీకు మేడ మీద ఉన్న ఒక విశాలమైన గది చూపిస్తాడు. ఆ గదిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. పస్కా భోజనం అక్కడ తయారు చెయ్యండి” అని అన్నాడు. వాళ్ళు వెళ్ళి, అన్నీ యేసు చెప్పిన విధంగా ఉండటం గమనించారు. అక్కడ వాళ్ళు పస్కా పండుగ భోజనం తయారు చేసారు. భోజనం చేసే సమయం దగ్గరకు వచ్చింది. యేసు, ఆయన అపొస్తలులు భోజనానికి కూర్చున్నారు. ఆయన వాళ్ళతో, “నేను చనిపోకముందే మీతో కలిసి ఈ పస్కా భోజనము చెయ్యాలని ఎంతో ఆశ పడ్డాను. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఈ పస్కా భోజనమునకు ఉన్న నిజమైన అర్థం నెరవేరుతుంది. అంతవరకు ఈ భోజనం మళ్ళీ చెయ్యను” అని అన్నాడు. ఆయన గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, “ఇది తీసుకొని మీ మధ్య పంచుకొండి. ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చేవరకు నేను ద్రాక్షతో చేసిన ఈ పానీయం మళ్ళీ త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు. ఆ తర్వాత ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని త్రుంచి వాళ్ళకిస్తూ, “ఇది నా శరీరం. మీకోసం యివ్వబడింది. నా జ్ఞాపకార్థం యిది చెయ్యండి” అని అన్నాడు.

షేర్ చేయి
Read లూకా 22

లూకా 22:7-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పస్కాపశువును వధింపవలసిన పులియనిరొట్టెల దినమురాగా యేసు పేతురును యోహానును చూచి– మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు–మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన–ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి –నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి. అప్పుడాయన– నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి–మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి; ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పు చున్నాననెను. పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి–ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.

షేర్ చేయి
Read లూకా 22