లూకా 22:7-19

లూకా 22:7-19 IRVTEL

పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది. యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు. వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు. ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి. మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి. అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు. సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు. సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు. అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను. ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.” తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి. ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు. ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు.