లూకా 22:7-19

లూకా 22:7-19 TCV

పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, యేసు పేతురు మరియు యోహానును పిలిచి, “మీరు వెళ్లి మనం పస్కాను భుజించడానికి సిద్ధం చేయండి” అని పంపారు. కనుక వారు, “మేము ఎక్కడ ఏర్పాటు చేయాలి?” అని అడిగారు. అందుకు ఆయన, “మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకొని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, అతడు ప్రవేశించే ఇంటి వరకు అతన్ని వెంబడించి, ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి. అతడు అన్ని సదుపాయాలతో ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు. వారు అక్కడికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొని పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు. వారు పస్కా భుజించే సమయం వచ్చినపుడు, ఆయన తన అపొస్తలులతో భోజనబల్ల దగ్గర కూర్చున్నారు. ఆయన వారితో, “నేను శ్రమను అనుభవించక ముందు ఈరీతిగా మీ అందరితో కలిసి ఈ పస్కా విందును భుజించాలని ఎంతో ఆశించాను. ఎందుకంటే, ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు, మరలా దీనిని నేను భుజించను అని మీకు చెప్తున్నాను” అన్నారు. ఆయన గిన్నెను తీసుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, “ఇది తీసుకుని మీరందరు పంచుకోండి. దేవుని రాజ్యం వచ్చేవరకు మళ్ళీ ఈ ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుతున్నాను” అన్నారు. ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, “ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.