లూకా 12:13-33
లూకా 12:13-33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ జనసమూహంలో నుండి ఒకడు ఆయనతో, “బోధకుడా, వారసునిగా నేను పొందాల్సిన ఆస్తి భాగాన్ని పంచమని నా సహోదరునితో చెప్పండి” అన్నాడు. అందుకు యేసు, “అయ్యా, నన్ను మీకు న్యాయాధిపతిగా గానీ మధ్యవర్తిగా గానీ నన్నెవరు నియమించారు?” అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు. ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది. అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’ “అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని నిల్వచేసుకొంటాను. నాతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీ కొరకు సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు. “కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం తీయబడుతుంది. అప్పుడు నీ కొరకు నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’ “దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కొరకు సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు. తర్వాత యేసు తన శిష్యులతో, “కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేక ఏమి ధరించాలి అని మీ దేహాన్ని గురించి గాని చింతించకండి. ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. కాకులను చూడండి: అవి విత్తవు కోయవు, వాటికి నిల్వచేసుకోడానికి గది కాని కొట్లు కాని లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నారు. పక్షుల కన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు. మీలో ఎవరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? మీరు ఇంత చిన్నదాన్ని చేయలేనప్పుడు, మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తారు? “అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. అయినను గొప్ప వైభవం కలిగివున్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో పడవేయబడే, పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు! ఏమి తింటారో ఏమి త్రాగుతారో అనేవాటిపై మీ హృదయాన్ని నిలపకండి; దాని గురించి చింతించకండి. ఎందుకంటే దేవుని ఎరుగని లోకం అలాంటి వాటి వెంటపడుతుంది కాని, అవన్నీ మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు. కనుక ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవి కూడా మీకు ఇవ్వబడతాయి. “చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కొరకు పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.
లూకా 12:13-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ జనసమూహంలో ఒకడు, “ఉపదేశకా, వారసత్వంగా వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి” అన్నాడు. అందుకు ఆయన, “ఏమయ్యా, మీ మీద పెద్దమనిషిగా మధ్యవర్తిగానో నన్నెవరు నియమించారు?” అన్నాడు. ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.” తరువాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. “ఒక ధనవంతుడి భూమి బాగా దిగుబడి ఇచ్చింది. అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు, ‘నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను. నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ నిల్వ చేస్తాను. అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు. అయితే దేవుడు అతడితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?’ అని అతనితో అన్నాడు. దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు” అన్నాడు. తరువాత యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు, “అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే ఎంతో ఉన్నతమైన వారు. పైగా మీలో ఎవడు చింత పడడం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ చేసుకోగలడు? కాబట్టి చిన్న చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి. అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలొమోనుకున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెబుతున్నాను. అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా. ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. లోకులు వీటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితోపాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి. చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం. మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతగిలిపోని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు.
లూకా 12:13-33 పవిత్ర బైబిల్ (TERV)
ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు. యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు. ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది. అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు. “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు. “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు. “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.” ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందువల్ల నేను చెప్పేదేమిటంటే జీవించటానికి ఏమి తినాలి? మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి? అని చింతించకండి. మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది. పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. పంటకోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాపక్షుల కన్నా విలువైన వాళ్ళు. చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు? “పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి. “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. ప్రపంచం లోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు. ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు. “మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు. మీ ఆస్థి అమ్మి పేదవాళ్ళకు దానం చెయ్యండి. పాతబడని డబ్బుల సంచి సిద్దం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి. అక్కడ అది తరగదు. దొంగలు దాన్ని ముట్టలేరు. ఆ సంపదకు చెదలు పట్టవు.
లూకా 12:13-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ జనసమూహములో ఒకడు–బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన–ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో–మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు–నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని – నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో – ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు–వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను. అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి. ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు? కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతోకూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును. చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించు కొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు
లూకా 12:13-33 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆ జనసమూహంలో నుండి ఒకడు ఆయనతో, “బోధకుడా, వారసునిగా నేను పొందాల్సిన ఆస్తి భాగాన్ని పంచమని నా సహోదరునితో చెప్పండి” అన్నాడు. అందుకు యేసు, “అయ్యా, నన్ను మీకు న్యాయాధిపతిగా గాని మధ్యవర్తిగా గాని నన్నెవరు నియమించారు?” అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు. ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది. అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’ “అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని సమకూర్చుకుంటాను. నా ఆత్మతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీకోసం సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు. “కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతే, నీకోసం నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’ “దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కోసం సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు. తర్వాత యేసు తన శిష్యులతో, “కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. కాకులను చూడండి: అవి విత్తవు కోయవు, వాటికి నిల్వ చేసుకోడానికి గది కాని కొట్లు కాని లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నారు. పక్షుల కన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు. మీలో ఎవరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? మీరు ఇంత చిన్నదాన్ని చేయలేనప్పుడు, మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తారు? “అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో పడవేయబడే, పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు! ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి. దేవుని ఎరుగనివారు అలాంటి వాటి వెంటపడతారు కాని, అవన్నీ మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. “చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కోసం పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.