ఆ జనసమూహంలో నుండి ఒకడు ఆయనతో, “బోధకుడా, వారసునిగా నేను పొందాల్సిన ఆస్తి భాగాన్ని పంచమని నా సహోదరునితో చెప్పండి” అన్నాడు.
అందుకు యేసు, “అయ్యా, నన్ను మీకు న్యాయాధిపతిగా గానీ మధ్యవర్తిగా గానీ నన్నెవరు నియమించారు?” అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు.
ఇంకా ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఒక ధనవంతుని పొలం సమృద్ధిగా పంట పండింది. అప్పుడు అతడు తనలో తాను అనుకున్నాడు, ‘నేను ఏమి చేయాలి? ఈ పంటంతటిని నిల్వ చేసుకోవడానికి నాకు స్ధలం చాలదు.’
“అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని నిల్వచేసుకొంటాను. నాతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీ కొరకు సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు.
“కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం తీయబడుతుంది. అప్పుడు నీ కొరకు నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’
“దేవునిలో ధనవంతుడు కాకుండా తమ కొరకు సమకూర్చుకొనేవారి స్థితి ఇలా ఉంటుంది” అని చెప్పారు.
తర్వాత యేసు తన శిష్యులతో, “కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేక ఏమి ధరించాలి అని మీ దేహాన్ని గురించి గాని చింతించకండి. ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. కాకులను చూడండి: అవి విత్తవు కోయవు, వాటికి నిల్వచేసుకోడానికి గది కాని కొట్లు కాని లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నారు. పక్షుల కన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు. మీలో ఎవరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా? మీరు ఇంత చిన్నదాన్ని చేయలేనప్పుడు, మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తారు?
“అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. అయినను గొప్ప వైభవం కలిగివున్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో పడవేయబడే, పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు! ఏమి తింటారో ఏమి త్రాగుతారో అనేవాటిపై మీ హృదయాన్ని నిలపకండి; దాని గురించి చింతించకండి. ఎందుకంటే దేవుని ఎరుగని లోకం అలాంటి వాటి వెంటపడుతుంది కాని, అవన్నీ మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు. కనుక ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవి కూడా మీకు ఇవ్వబడతాయి.
“చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మీ ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వండి. మీ కొరకు పాతగిల్లని డబ్బు సంచులను ఏర్పరచుకోండి, పరలోకంలో ధనం ఎప్పటికీ తరిగిపోదు, అక్కడ ఏ దొంగ సమీపించలేడు, ఏ చిమ్మెట కొట్టివేయలేదు.