ఆ జనసమూహములో ఒకడు–బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన–ఓయీ, మీమీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో–మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను –ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు–నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని – నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో – ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు–వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి. ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొన గలడు? కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్తవైభవముతోకూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి, రేపు పొయిలోవేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితోకూడ ఇవి మీ కనుగ్రహింపబడును. చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించు కొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు