లూకా 11:14-36
లూకా 11:14-36 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒక రోజు యేసు మూగ దయ్యాన్ని వెళ్లగొడుతున్నారు. దయ్యం వెళ్లిపోగానే, ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడ్డారు. అయితే వారిలో కొందరు, “ఇతడు బయెల్జెబూలు, అనే దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు. మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు. యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు: ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది, ఒక కుటుంబం దానికదే వ్యతిరేకించి చీలిపోతే అది కూలిపోతుంది. ఒకవేళ సాతాను కూడా తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? నేనిలా చెప్తున్నా ఎందుకంటే నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నానని మీరు అంటున్నారు గనుక. ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ అనుచరులు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు, వారే మీకు తీర్పుతీర్చుతారు. కానీ ఒకవేళ నేను దేవుని అధికారంతో దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థం. “బలవంతుడైనవాడు ఆయుధాలను ధరించుకొని, తన ఇంటిని కాపల కాస్తున్నప్పుడు, అతని ఆస్తి భద్రంగా ఉంటుంది. అయితే అతనికంటే బలవంతుడు వానిని ఓడించినప్పుడు, వాడు నమ్మకముంచిన ఆ ఆయుధాలను తీసుకొన్న తర్వాతే అతని ఆస్తినంతటిని దోచుకొంటాడు. “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. “అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, అది విశ్రాంతి కొరకు నీరు లేని స్థలాలను వెదకుతుంది, కాని అలాంటి స్థలం దానికి దొరకనప్పుడు ‘నేను వదలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది. అది తిరిగి అక్కడకు వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి పెట్టి కనిపిస్తుంది. అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తుంది. కనుక అతని మొదటి స్థితి కంటే చివరి స్ధితి చాలా దారుణంగా ఉంటుంది.” యేసు ఈ మాటలను చెప్తుండగా, ఆ జనసమూహంలోని ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు ధన్యమైనవి” అని కేకలు వేసి చెప్పింది. అందుకు యేసు, “అది నిజమే, కానీ దానికంటే దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపేవారు ఇంకా ధన్యులు” అని చెప్పారు. జనుల గుంపులు పెరుగుతూ ఉండగా యేసు, “ఇది దుష్టతరం. వీరు సూచనను అడుగుతున్నారు కానీ వీరికి యోనా సూచన తప్ప మరి ఏ సూచన ఇవ్వబడదు. నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండినట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు. దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచులనుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కనుక తీర్పు దినాన ఆమె ఈ తరంవారితోపాటు లేచి వారిని ఖండిస్తుంది. నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా, ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె ప్రజలు న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు” అని చెప్పారు. “ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేక పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు. నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటే, నీ దేహమంతా కూడా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. నీలో ఉన్న దేనిని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో. కాబట్టి, నీ దేహంలో ఏ భాగం చీకటి కాకుండా నీ దేహమంతా వెలుగు మయమైతే, నీ మీద దీపం వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది” అని చెప్పారు.
లూకా 11:14-36 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు. మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు. ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది. సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు. అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే. బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది. అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు. నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే. “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది ‘నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను’ అనుకుంటుంది. అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి తిరిగి వెళ్ళి, తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది” అని చెప్పాడు. ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు. ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు, “ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరి ఏ సూచనా వీరికి చూపడం జరగదు. యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు. దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు. “ఎవరూ దీపాన్ని వెలిగించి చాటుగానో బుట్ట కిందనో పెట్టరు, లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడాలని దీపస్తంభం పైనే పెడతారు. నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను మంచిదైతే నీ శరీరమంతా వెలుగు ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి మయమై ఉంటుంది. కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో. నీ దేహంలో ఏ భాగమూ చీకటిలో లేకుండా నీ దేహం అంతా వెలుగే ఉన్నట్టయితే, దీపం కాంతి నీపై ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది.”
లూకా 11:14-36 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రోజు యేసు ఒక మూగ దయ్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే అది పట్టిన మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. అది చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. కొందరు, “బయెల్జెబూలు అనే దయ్యాలరాజు ద్వారా అతడు దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు. మరి కొందరు యేసును పరీక్షించుచూ ఒక అద్భుతం పరలోకం నుండి చూపుమని అడిగారు. యేసుకు వాళ్ళ అభిప్రాయం తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “చీలికలు కలిగిన యిల్లు పడిపోతుంది. సైతానురాజ్యంలో చీలికలు కలిగితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాల్ని వదిలిస్తున్నానని మీరు అంటున్నారు. నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాల్ని వదిలిస్తున్నట్లైతే, మీ వాళ్ళు దేని సహయంతో దయ్యాల్ని వదిలిస్తున్నారు? అందువల్ల మీ వాదన తప్పని మీ వాళ్ళే రుజువు చేస్తున్నారు. కాని నేను దైవశక్తితో దయ్యాల్ని వదిలిస్తున్నాను కనుక, దేవుని రాజ్యం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది. “ఒక బలవంతుడు ఆయుధాల్ని ధరించి తన యింటిని కాపలా కాస్తే అతని యింట్లోని వస్తువులు భధ్రంగా ఉంటాయి. కాని అతని కన్నా బలవంతుడు వచ్చి మీదపడి అతన్ని ఓడిస్తే అతడిన్నాళ్ళు నమ్ముకున్న ఆయుధాలన్నీ ఇంటివానియొద్ద నుండి తీసుకొని, ఆదోచుకొన్న వస్తువుల్ని అందరికి పంచి పెడ్తాడు. “నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్న వానితో సమానము. నాతో కలిసి గొఱ్ఱెల్ని ప్రోగుచేయటానికి సహాయం చెయ్యనివాడు వాటిని చెదరగొట్టిన వానితో సమానము. “దయ్యము ఒక మనిషి నుండి వెలుపలికి వచ్చాక విశ్రాంతి కోసం నీరులేని స్థలాల్లో వెతుకుతుంది. కాని దానికి విశ్రాంతి లభించదు. అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన యింటికి వెళ్తాను’ అని అనుకుంటుంది. అక్కడికి వెళ్ళాక ఆ యిల్లు ఊడ్చబడి వుండటం ఎక్కడి వస్తువులక్కడ సక్రమంగా వుండటం చూస్తుంది. అది మళ్ళీ బయటికి వెళ్ళి తనకన్నా దుర్మార్గులైన ఏడు దయ్యాలను తనవెంట తీసుకువస్తుంది. ఆ దయ్యాలన్నీ కలిసి ఆ యింట్లో నివసించటానికి వెళ్తాయి. అప్పుడు ఆ మనిషి స్థితి మొదటిస్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది.” యేసు ఈ విషయాలు చెబుతుండగా ప్రజల్లో ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను కని, పెంచిన ఆ తల్లి ధన్యురాలు” అని అన్నది. ఆయన, “అవునుగాని, దైవసందేశం విని దాన్ని పాటించే వాళ్ళు ఇంకా ధన్యులు” అని సమాధానం చెప్పాడు. ప్రజల గుంపు పెరుగుతూ పోయింది. యేసు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు, గనుక అద్భుతాలు అడుగుతారు. దేవుడు యోనాను పంపి యిచ్చిన రుజువు తప్ప, మరే రుజువు మీకు యివ్వబడదు. ఎందుకంటే, నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక రుజువు. “దక్షిణ దేశపు రాణి సొలొమోను రాజు బోధిస్తున్న జ్ఞానాన్ని వినటానికి చాలా దురం నుండి వచ్చింది. కాని యిప్పుడు సొలోమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. ఈనాటి ప్రజలు ఆయన మాటలు వినటం లేదు. కనుక తీర్పు చెప్పబడే రోజు ఆ రాణి వీళ్ళతో సహా నిలబడి వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తుంది. “నీనెవె ప్రజలు యోనా బోధనలు విని మారుమానస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజున వాళ్ళు ఈనాటి ప్రజలతో సహా నిలుచొని వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తారు. కాని యిప్పుడు యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. “దీపాన్ని వెలిగించి, యింటికి వచ్చే పోయే వాళ్ళకు కనిపించేలా ఒక ఎత్తైన బల్ల మీద పెడ్తాము కాని, గంప క్రింద దాచి ఉంచము. మీ కళ్ళు దేహానికి దీపం లాంటివి. మీ కళ్ళు బాగుంటే మీ దేహమంతా కాంతితో వెలుగుతుంది. కాని, అవి చెడిపోతే, మీ దేహమంతా చీకటైపోతుంది. అందువలన మీలో ఉన్న వెలుగు చీకటైపోకుండా చూసుకొండి. మీ దేహమంతా కొంచెం కూడా చీకటిలో లేకుండా వెలుగుతూ ఉంటే అది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దేహం దీపపు వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తుంది.”
లూకా 11:14-36 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు–వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు–పరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి. ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను–తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులైయుందురు. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున–నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్లి, తనకంటె చెడ్డైవెన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను. ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్ర్తీ ఆయనను చూచి–నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయనఅవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెను–ఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచకక్రియ నడుగుచున్నారు. అయితే యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును. దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితోకూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితోకూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము. ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలు గిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.