లూకా 11:14-36

లూకా 11:14-36 TCV

ఒక రోజు యేసు మూగ దయ్యాన్ని వెళ్లగొడుతున్నారు. దయ్యం వెళ్లిపోగానే, ఆ మూగవానిగా ఉండినవాడు మాట్లాడాడు, దానికి జనసమూహం ఆశ్చర్యపడ్డారు. అయితే వారిలో కొందరు, “ఇతడు బయెల్జెబూలు, అనే దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అన్నారు. మరికొందరు పరలోకం నుండి ఒక సూచన కావాలని అడుగుతూ ఆయనను పరీక్షించారు. యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఈ విధంగా అన్నారు: ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే అది నాశనం అవుతుంది, ఒక కుటుంబం దానికదే వ్యతిరేకించి చీలిపోతే అది కూలిపోతుంది. ఒకవేళ సాతాను కూడా తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? నేనిలా చెప్తున్నా ఎందుకంటే నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నానని మీరు అంటున్నారు గనుక. ఒకవేళ బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాలను వెళ్లగొడితే మీ అనుచరులు ఎవరి సహాయంతో వెళ్లగొడతారు? అప్పుడు, వారే మీకు తీర్పుతీర్చుతారు. కానీ ఒకవేళ నేను దేవుని అధికారంతో దయ్యాలను వెళ్లగొడుతున్నట్లయితే, అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చిందని అర్థం. “బలవంతుడైనవాడు ఆయుధాలను ధరించుకొని, తన ఇంటిని కాపల కాస్తున్నప్పుడు, అతని ఆస్తి భద్రంగా ఉంటుంది. అయితే అతనికంటే బలవంతుడు వానిని ఓడించినప్పుడు, వాడు నమ్మకముంచిన ఆ ఆయుధాలను తీసుకొన్న తర్వాతే అతని ఆస్తినంతటిని దోచుకొంటాడు. “నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. “అపవిత్రాత్మ ఒక వ్యక్తి నుండి బయటకు రాగానే, అది విశ్రాంతి కొరకు నీరు లేని స్థలాలను వెదకుతుంది, కాని అలాంటి స్థలం దానికి దొరకనప్పుడు ‘నేను వదలిన ఇంటికే తిరిగి వెళ్తాను’ అని అనుకుంటుంది. అది తిరిగి అక్కడకు వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, చక్కగా అమర్చి పెట్టి కనిపిస్తుంది. అప్పుడు అది వెళ్లి దానికంటే మరి చెడ్డవైన ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చి అక్కడే నివసిస్తుంది. కనుక అతని మొదటి స్థితి కంటే చివరి స్ధితి చాలా దారుణంగా ఉంటుంది.” యేసు ఈ మాటలను చెప్తుండగా, ఆ జనసమూహంలోని ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు ధన్యమైనవి” అని కేకలు వేసి చెప్పింది. అందుకు యేసు, “అది నిజమే, కానీ దానికంటే దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపేవారు ఇంకా ధన్యులు” అని చెప్పారు. జనుల గుంపులు పెరుగుతూ ఉండగా యేసు, “ఇది దుష్టతరం. వీరు సూచనను అడుగుతున్నారు కానీ వీరికి యోనా సూచన తప్ప మరి ఏ సూచన ఇవ్వబడదు. నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండినట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు. దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచులనుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, కనుక తీర్పు దినాన ఆమె ఈ తరంవారితోపాటు లేచి వారిని ఖండిస్తుంది. నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా, ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె ప్రజలు న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు” అని చెప్పారు. “ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని చాటుగా ఉండే చోటులో లేక పాత్ర క్రింద పెట్టరు. దానికి బదులు లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు. నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటే, నీ దేహమంతా కూడా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది. నీలో ఉన్న దేనిని నీవు వెలుగు అనుకుంటున్నావో అది నిజానికి చీకటి కాకుండా చూసుకో. కాబట్టి, నీ దేహంలో ఏ భాగం చీకటి కాకుండా నీ దేహమంతా వెలుగు మయమైతే, నీ మీద దీపం వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది” అని చెప్పారు.