ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు. మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు. ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది. సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు. అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే. బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది. అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు. నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే. “అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది ‘నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను’ అనుకుంటుంది. అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి తిరిగి వెళ్ళి, తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది” అని చెప్పాడు. ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు. ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు, “ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరి ఏ సూచనా వీరికి చూపడం జరగదు. యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు. దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు. “ఎవరూ దీపాన్ని వెలిగించి చాటుగానో బుట్ట కిందనో పెట్టరు, లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడాలని దీపస్తంభం పైనే పెడతారు. నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను మంచిదైతే నీ శరీరమంతా వెలుగు ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి మయమై ఉంటుంది. కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో. నీ దేహంలో ఏ భాగమూ చీకటిలో లేకుండా నీ దేహం అంతా వెలుగే ఉన్నట్టయితే, దీపం కాంతి నీపై ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది.”
Read లూకా 11
వినండి లూకా 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 11:14-36
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు