విలాపవాక్యములు 3:1-20

విలాపవాక్యములు 3:1-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను యెహోవా ఆగ్రహదండం వల్ల బాధ అనుభవించిన వాణ్ణి. ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు. నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు. ఆయన నా మాంసం, నా చర్మం చీకిపోయేలా చేస్తున్నాడు, నా ఎముకలను విరగ్గొట్టాడు. నాకు విరుద్ధంగా ముట్టడి కంచె నిర్మించాడు. క్రూరత్వం, కష్టం నా చుట్టూ ఉంచాడు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఉండే చీకటి తావుల్లో నేను ఉండేలా చేశాడు. ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు. నేను కేకలు పెట్టి పిలిచినా, నా ప్రార్థనలు తోసివేశాడు. ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు. నా పాలిట ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలా ఉన్నాడు. దాగి ఉన్న సింహంలా ఉన్నాడు. నాకు దారి లేకుండా చేసి నన్ను చీల్చి చెండాడి నాకు దిక్కు లేకుండా చేశాడు. విల్లు ఎక్కుపెట్టి బాణానికి గురిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు. తన అంబుల పొదిలోని బాణాలన్నీ ఆయన నా మూత్రపిండాల గుండా దూసుకెళ్ళేలా చేశాడు. నా ప్రజలందరికీ నేను నవ్వులాటగా ఉన్నాను. ప్రతి రోజూ వాళ్ళు నా గురించి ఆక్షేపణ పాటలు పాడుతున్నారు. చేదు పదార్ధాలు ఆయన నాకు తినిపించాడు. విష ద్రావకంతో నన్ను మత్తెక్కేలా చేశాడు. రాళ్లతో నా పళ్ళు విరగ్గొట్టాడు. బూడిదలోకి నన్ను అణగ దొక్కాడు. నా జీవితంలోనుంచి శాంతి తొలగించాడు. నాకు సంతోషం గుర్తు లేదు. కాబట్టి నేను “నా శోభ అంతరించి పోయింది, యెహోవాలో నాకు ఇంక ఆశ మిగల లేదు” అనుకున్నాను. నా బాధ, నా దురవస్థ, నేను తాగిన ద్రావకపు చేదు నేను గుర్తు చేసుకుంటున్నాను. కచ్చితంగా నేను వాటిని గుర్తు చేసుకుని, నాలో నేను కృంగిపోయాను.

విలాపవాక్యములు 3:1-20 పవిత్ర బైబిల్ (TERV)

నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని. యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను. యెహోవా నన్ను చీకటిలోకి నడపించాడేగాని వెలుగులోకి కాదు. యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు. రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు. ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు. ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు. యెహోవా నా పైకి కష్టాలను, వేదనను రప్పించాడు. ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరిస్థితిని కలుగచేశాడు. ఆయన నన్ను చీకటిలో కూర్చునేలా చేశాడు. ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన చేశాడు. యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు. ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు. సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థించినా, యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు. ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు. ఆయన నా మార్గాన్ని వక్రంగా, గతుకులమయం చేశాడు. నా మీదకు పడనున్న ఎలుగుబంటిలా యెహోవా ఉన్నాడు. ఆయన పొంచి వున్న ఒక సింహంలా ఉన్నాడు. యెహోవా నన్ను నా మార్గం నుండి తొలగించాడు. ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. నన్ను నాశనం చేశాడు. ఆయన విల్లంబులు చేపట్టాడు. ఆయన బాణాలకు నన్ను గురి చేశాడు. ఆయన నా పొట్టలో బాణం వేశాడు. ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు. నా ప్రజలందరిలో నేను నవ్వులపాలయ్యాను. రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు. యెహోవా నాచేత చేదు పానీయం (శిక్ష) తాగించాడు. ఆయన చేదు పానీయాలతో నన్ను నింపివేశాడు. నా పండ్లు రాత్రి నేలలో గుచ్చుకుపోయేలా యెహోవా నన్ను తోశాడు. ఆయన నన్ను మట్టిలోకి త్రోసివేశాడు. ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను. మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను. “యెహోవా తిరిగి నాకు సహాయం చేస్తాడనే ఆశ లేదనుకొన్నాను.” ఓ యెహోవా, నా దుఃఖాన్ని, నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము. నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము. నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను మిక్కిలి విచారిస్తున్నాను.

విలాపవాక్యములు 3:1-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేను ఆయన ఆగ్రహదండముచేత బాధననుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కులేకుండ చేసియున్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను. నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని. చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను. నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.

విలాపవాక్యములు 3:1-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా ఉగ్రత కర్ర చేత నేను బాధను అనుభవించిన వాన్ని. ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు. నిజానికి, ఆయన రోజంతా మాటిమాటికి నా మీద తన చేయి ఆడిస్తానే ఉన్నారు. ఆయన నా చర్మాన్ని, నా మాంసాన్ని క్షీణించిపోయేలా చేసి నా ఎముకలను విరగ్గొట్టారు. ఆయన నన్ను ముట్టడించి, విషంతో కఠినత్వంతో నన్ను చుట్టుముట్టారు. ఎప్పుడో చనిపోయినవారు పడి ఉన్నట్లుగా ఆయన నన్ను చీకటిలో పడి ఉండేలా చేశారు. నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు; బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు. నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు. ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు; ఆయన నా మార్గాలను వంకర చేశారు. పొంచి ఉన్న ఎలుగుబంటిలా, దాక్కున్న సింహంలా, ఆయన నన్ను దారిలో నుండి ఈడ్చుకెళ్లి, నన్ను ముక్కలు చేసి, నిస్సహాయ స్థితిలో వదిలేశారు. ఆయన తన విల్లు తీసి, తన బాణాలకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు. నేను నా ప్రజలందరికి నవ్వులాటగా మారాను; రోజంతా వారు పాటలో నన్ను హేళన చేస్తున్నారు. ఆయన నాతో చేదు మూలికలు తినిపించారు, త్రాగడానికి చేదు పానీయాన్ని ఇచ్చారు. ఆయన రాళ్లతో నా పళ్లను విరగ్గొట్టారు; నన్ను దుమ్ములో త్రొక్కారు. సమాధానం నాకు దూరమైంది, అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను. కాబట్టి, “నా వైభవం పోయింది, యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను. నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి, నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి. నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది.