విలాప 3:1-20

విలాప 3:1-20 OTSA

యెహోవా ఉగ్రత కర్ర చేత నేను బాధను అనుభవించిన వాన్ని. ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు. నిజానికి, ఆయన రోజంతా మాటిమాటికి నా మీద తన చేయి ఆడిస్తానే ఉన్నారు. ఆయన నా చర్మాన్ని, నా మాంసాన్ని క్షీణించిపోయేలా చేసి నా ఎముకలను విరగ్గొట్టారు. ఆయన నన్ను ముట్టడించి, విషంతో కఠినత్వంతో నన్ను చుట్టుముట్టారు. ఎప్పుడో చనిపోయినవారు పడి ఉన్నట్లుగా ఆయన నన్ను చీకటిలో పడి ఉండేలా చేశారు. నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు; బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు. నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు. ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు; ఆయన నా మార్గాలను వంకర చేశారు. పొంచి ఉన్న ఎలుగుబంటిలా, దాక్కున్న సింహంలా, ఆయన నన్ను దారిలో నుండి ఈడ్చుకెళ్లి, నన్ను ముక్కలు చేసి, నిస్సహాయ స్థితిలో వదిలేశారు. ఆయన తన విల్లు తీసి, తన బాణాలకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు. నేను నా ప్రజలందరికి నవ్వులాటగా మారాను; రోజంతా వారు పాటలో నన్ను హేళన చేస్తున్నారు. ఆయన నాతో చేదు మూలికలు తినిపించారు, త్రాగడానికి చేదు పానీయాన్ని ఇచ్చారు. ఆయన రాళ్లతో నా పళ్లను విరగ్గొట్టారు; నన్ను దుమ్ములో త్రొక్కారు. సమాధానం నాకు దూరమైంది, అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను. కాబట్టి, “నా వైభవం పోయింది, యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను. నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి, నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి. నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది.

Read విలాప 3