విలాపవాక్యములు 3:1-20

విలాపవాక్యములు 3:1-20 TELUBSI

నేను ఆయన ఆగ్రహదండముచేత బాధననుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కులేకుండ చేసియున్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను. నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని. చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను. నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.