యోవేలు 2:1-17
యోవేలు 2:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సీయోనులో బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక. అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. తరతరాల తరువాత కూడా అది ఉండదు. దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. వాటి వెనుక, మంట మండుతూ ఉంది. అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది. అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. దానినుంచి ఏదీ తప్పించుకోలేదు. సేన రూపం, గుర్రాల లాగా ఉంది. వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు. వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు. వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి. అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి. ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు. పట్టణంలో చొరబడుతున్నాయి. గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి. వాటి ముందు భూమి కంపిస్తున్నది, ఆకాశాలు వణుకుతున్నాయి. సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి. యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, ఆయన యోధులు చాలా ఎక్కువమంది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. దాన్ని ఎవరు వైపుకోగలరు? యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.” మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి. ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు? సీయోనులో బాకా ఊదండి. ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. ప్రజలను సమకూర్చండి. సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి. యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. “యెహోవా, నీ ప్రజలను కనికరించు. నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?”
యోవేలు 2:1-17 పవిత్ర బైబిల్ (TERV)
సీయోనులో బూర ఊదండి. నా పవిత్ర పర్వతంమీద హెచ్చరికగా కేకవేయండి. దేశంలో నివసించే ప్రజలందరూ భయంతో వణుకుదురు గాక. యెహోవా ప్రత్యేకదినం వస్తుంది. యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. అది ఒక చీకటి దుర్దినంగా ఉంటుంది. అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది. సూర్యోదయాన సైన్యం పర్వతాలలో నిండి ఉండటం నీవు చూస్తావు. అది మహాశక్తిగల సైన్యంగా ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటిది ఏదీ, ఎన్నడూ ఉండలేదు. మరియు ఇలాంటిది ఏదీ, ఎన్నటికీ మరోసారి ఉండదు. మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం చేస్తుంది. వారి ఎదుట దేశం ఏదెను వనంలా ఉంది. వారి వెనుక దేశం ఖాళీ ఎడారిలా ఉంది. ఏదీ వారినుండి తప్పించుకోలేదు. వారు గుఱ్ఱాల్లా కనబడతారు. యుద్ధ గుఱ్ఱాల్లావారు పరుగెత్తుతారు. వారి మాట వినండి. అది పర్వతాలమీద రథాలు పరుగులెత్తిన ధ్వనిలా ఉంది. అది పొట్టును కాల్చివేస్తోన్న అగ్నిజ్వాలల శబ్దంలా ఉంది. వారు శక్తిగల ఒక జనం. వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణకుతారు. వారి ముఖాలు భయంతో తెల్లబడి పోతాయి. ఆ సైనికులు వేగంగా పరుగెత్తుతారు. ఆ సైనికులు గోడలు ఎక్కుతారు. ప్రతి సైనికుడూ తిన్నగా ముందుకు దూసుకొనిపోతాడు. వారు వారి మార్గంనుండి తప్పుకోరు. వారు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడరు. ప్రతి సైనికుడూ తన సొంత దారిలో నడుస్తాడు. ఒక సైనికుడు దెబ్బ తగిలి పడిపోతే మిగిలిన వారు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. వారు పట్టణానికి పరుగెత్తుతారు. వారు త్వరగా గోడ ఎక్కుతారు. వారు ఇండ్లలోనికి ఎక్కిపోతారు. వారు ఒక దొంగలా కిటికీల్లో నుండి ప్రవేశిస్తారు. వారి ఎదుట భూమి, ఆకాశం వణుకుతాయి. సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి. మరియు నక్షత్రాలు ప్రకాశించటం మాని వేస్తాయి. యెహోవా తన సైన్యాన్ని గట్టిగా పిలుస్తాడు. ఆయన విడిది చాలా విశాలమైంది. ఆ సైన్యం ఆయన ఆదేశాలకు లోబడుతుంది. ఆ సైన్యం చాలా శక్తిగలది. యెహోవా ప్రత్యేక దినం ఒక గొప్ప భయంకర దినం. ఏ మనిషీ దానిని ఆపు చేయలేడు. ఇది యెహోవా సందేశం: “ఇప్పుడు మీ పూర్ణహృదయంతో నా దగ్గరకు తిరిగిరండి. మీరు చెడ్డ పనులు చేసారు. ఏడువండి, ఏడువండి. భోజనం ఏమీ తినకండి. మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చింపుకోండి.” మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి. ఆయన దయ, జాలిగలవాడు. ఆయన త్వరగా కోపపడడు. ఆయనకు ఎంతో ప్రేమఉంది. ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో. ఒకవేళ యెహోవా తన మనస్సు మార్చుకొంటాడేమో ఎవరికి తెలుసు. మరియు ఒకవేళ ఆయన తన వెనుక నీ కోసం ఒక ఆశీర్వాదం విడిచి పెడతాడేమో. అప్పుడు నీవు నీ యెహోవా దేవునికి ధాన్యార్పణం, పానీయార్పణం అర్పించవచ్చు. సీయోనులో బూర ఊదండి. ఒక ప్రత్యేక ఉపవాస సమయం ఏర్పాటు చేయండి. ప్రజలను సమావేశం చేయండి. ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. పెద్దవాళ్లను సమావేశపరచండి. చిన్న పిల్లలను, తల్లుల స్తనములను ఇంకా కుడిచే చిన్న శిశువులను సహితం సమావేశపరచండి. పెండ్లికుమార్తెను, ఆమె పెండ్లికుమారున్ని వారి పడకగదినుండి బయటకు రప్పించండి. యాజకులను, యెహోవా సేవకులను మండపానికి బలిపీఠానికి మధ్య విలపించనివ్వండి ఆ ప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు. నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు. నీ ప్రజలనుగూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు. ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ ‘వారిదేవుడు ఎక్కడ?’ అని చెప్పనియ్యకు.”
యోవేలు 2:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను. వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖ ములు తెల్లబారును. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి. వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు –యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు–వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.
యోవేలు 2:1-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సీయోనులో బూర ఊదండి; నా పరిశుద్ధ పర్వతం మీద నినాదాలు చేయండి. యెహోవా దినం రాబోతుంది కాబట్టి, దేశ నివాసులంతా వణకాలి, ఆ దినం సమీపంగా ఉంది. అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు. వాటి ముందు అగ్ని మండుతూ ఉంది, వాటి వెనుక మంటలు మండుతూ ఉన్నాయి. అవి రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది, అవి వచ్చిన తర్వాత ఎండిన ఎడారిలా మారింది ఏదీ వాటినుండి తప్పించుకోలేదు. అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి; సైనికుల గుర్రాల్లా అవి పరుగెడుతున్నాయి. రథాలు కదిలే ధ్వనిలా, అగ్నిజ్వాలలు కాల్చుతున్న శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన మహా సైన్యంలా, అవి పర్వత శిఖరాల మీద దూకుతున్నాయి, వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి. అవి వీరుల్లా ముందుకు వస్తున్నాయి, సైనికుల్లా అవి గోడలెక్కి వస్తున్నాయి. అవి అటూ ఇటూ తిరుగకుండా, తిన్నగా నడుస్తున్నాయి. ఒక దానినొకటి త్రోసుకోకుండా, అన్నీ నేరుగా ముందుకు వస్తున్నాయి. వాటికి ఆయుధాలు ఎదురుపడినా, అవి వరుస మాత్రం తప్పవు. అవి పట్టణం మీదికి దూసుకు వస్తాయి. గోడ మీద పరుగెత్తుతూ వస్తాయి. దొంగలు కిటికీల నుండి చొరబడినట్లు, అవి ఇళ్ళలోనికి దూరుతున్నాయి. వాటికి ముందు భూమి కంపిస్తుంది, ఆకాశాలు వణకుతాయి, సూర్యచంద్రులకు చీకటి కమ్ముతుంది. నక్షత్రాలు ఇక ప్రకాశించవు. యెహోవా తన సైన్యాన్ని నడిపిస్తూ ఉరుములా గర్జిస్తారు; ఆయన బలగాలు లెక్కకు మించినవి, ఆయన ఆజ్ఞకు లోబడే సైన్యం గొప్పది, యెహోవా దినం గొప్పది; అది భయంకరమైనది, దాన్ని ఎవరు తట్టుకోగలరు? యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి.” మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చీల్చుకుని, మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి, ఆయన కృపా కనికరం గలవాడు, త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు. ఆయన మీ వైపు తిరిగి మనస్సు మార్చుకుంటారేమో, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు, మళ్ళీ మీరు మీ దేవుడైన యెహోవాకు భోజనార్పణలు, పానార్పణలు తెస్తారేమో, ఎవరికి తెలుసు? సీయోనులో బూర ఊదండి, పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి, పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి. ప్రజలను సమకూర్చండి, సమావేశాన్ని ప్రతిష్ఠించండి; పెద్దలను రప్పించండి, పిల్లలను సమకూర్చండి, చంటి పిల్లలను కూడా తీసుకురండి. పెళ్ళికుమారుడు తన గదిని పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి. యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”