యోవేలు 2:1-17

యోవేలు 2:1-17 OTSA

సీయోనులో బూర ఊదండి; నా పరిశుద్ధ పర్వతం మీద నినాదాలు చేయండి. యెహోవా దినం రాబోతుంది కాబట్టి, దేశ నివాసులంతా వణకాలి, ఆ దినం సమీపంగా ఉంది. అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు. వాటి ముందు అగ్ని మండుతూ ఉంది, వాటి వెనుక మంటలు మండుతూ ఉన్నాయి. అవి రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది, అవి వచ్చిన తర్వాత ఎండిన ఎడారిలా మారింది ఏదీ వాటినుండి తప్పించుకోలేదు. అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి; సైనికుల గుర్రాల్లా అవి పరుగెడుతున్నాయి. రథాలు కదిలే ధ్వనిలా, అగ్నిజ్వాలలు కాల్చుతున్న శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన మహా సైన్యంలా, అవి పర్వత శిఖరాల మీద దూకుతున్నాయి, వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి. అవి వీరుల్లా ముందుకు వస్తున్నాయి, సైనికుల్లా అవి గోడలెక్కి వస్తున్నాయి. అవి అటూ ఇటూ తిరుగకుండా, తిన్నగా నడుస్తున్నాయి. ఒక దానినొకటి త్రోసుకోకుండా, అన్నీ నేరుగా ముందుకు వస్తున్నాయి. వాటికి ఆయుధాలు ఎదురుపడినా, అవి వరుస మాత్రం తప్పవు. అవి పట్టణం మీదికి దూసుకు వస్తాయి. గోడ మీద పరుగెత్తుతూ వస్తాయి. దొంగలు కిటికీల నుండి చొరబడినట్లు, అవి ఇళ్ళలోనికి దూరుతున్నాయి. వాటికి ముందు భూమి కంపిస్తుంది, ఆకాశాలు వణకుతాయి, సూర్యచంద్రులకు చీకటి కమ్ముతుంది. నక్షత్రాలు ఇక ప్రకాశించవు. యెహోవా తన సైన్యాన్ని నడిపిస్తూ ఉరుములా గర్జిస్తారు; ఆయన బలగాలు లెక్కకు మించినవి, ఆయన ఆజ్ఞకు లోబడే సైన్యం గొప్పది, యెహోవా దినం గొప్పది; అది భయంకరమైనది, దాన్ని ఎవరు తట్టుకోగలరు? యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఇప్పుడైనా ఉపవాసముండి ఏడుస్తూ దుఃఖిస్తూ మీ హృదయమంతటితో నా దగ్గరకు రండి.” మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చీల్చుకుని, మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి, ఆయన కృపా కనికరం గలవాడు, త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు. ఆయన మీ వైపు తిరిగి మనస్సు మార్చుకుంటారేమో, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించవచ్చు, మళ్ళీ మీరు మీ దేవుడైన యెహోవాకు భోజనార్పణలు, పానార్పణలు తెస్తారేమో, ఎవరికి తెలుసు? సీయోనులో బూర ఊదండి, పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి, పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి. ప్రజలను సమకూర్చండి, సమావేశాన్ని ప్రతిష్ఠించండి; పెద్దలను రప్పించండి, పిల్లలను సమకూర్చండి, చంటి పిల్లలను కూడా తీసుకురండి. పెళ్ళికుమారుడు తన గదిని పెళ్ళికుమార్తె తన పెద్ద గదిని విడిచి రావాలి. యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?”

Read యోవేలు 2