యోవేలు 2:1-17

యోవేలు 2:1-17 TELUBSI

సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను. వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును. రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖ ములు తెల్లబారును. బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి. వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు? సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి. జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు –యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు–వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.